రాష్ట్రానికి గొడ్డ‌లి పార్టీ గ్ర‌హణం వీడింది

రాష్ట్రానికి గొడ్డ‌లి పార్టీ గ్ర‌హ‌ణం వీడింద‌ని సీఎం చంద్ర‌బాబు వ్యాఖ్యానించారు. 2019లో రాష్ట్రానికి గొడ్డ‌లి పార్టీ గ్ర‌హ‌ణం ప‌ట్టుకుంద‌ని.. అయితే, 2024 నాటికి ఆ గ్ర‌హ‌ణం వీడింద‌ని చెప్పారు. బీజేపీ, జ‌న‌సేన పార్టీలో క‌లిసి టీడీపీ కూట‌మి ఆ గ్ర‌హణం వీడేలా చేసింద‌న్నారు. దీనికి ప్ర‌జ‌ల స‌హ‌కారం తోడైంద‌న్నారు. వెలిగొండ ప్రాజెక్టు తొలి ద‌శను ప్రారంభించిన అనంత‌రం.. సీఎం చంద్ర‌బాబు ప్ర‌సంగించారు. ఈ సంద‌ర్భంగా వెలిగొండ ప్రాజెక్టు కోసం ఉద్య‌మించిన పూల సుబ్బ‌య్య కుటుంబ స‌భ్యుల‌ను ఆయ‌న స‌త్క‌రించారు.

వెలిగొండ ప్రాజెక్టు ద్వారా కృష్నా న‌ది నీరు ఇక్క‌డి ప్రాంతాల‌కు చేరుతుంద‌న్నారు. ప‌శ్చిమ ప్ర‌కాశం జిల్లాతో పాటు క‌డ‌ప‌, నెల్లూరు మార్కాపురం జిల్లాల‌లో కృష్ణ‌మ్మ ప‌ర‌వ‌ళ్లు తొక్క‌నుంద‌న్నారు. దీనివ‌ల్ల క‌రువు ప్ర‌భావిత ప్రాంతాలు స‌స్య‌శ్యామ‌లం అవుతాయ‌న్నారు. కాగా.. వెలిగొండ‌ను పూర్తి చేయకుండానే గొడ్డ‌లి పార్టీ డ్రామాలు ఆడింద‌ని దుయ్య‌బ‌ట్టారు. వెలిగొండ కోసం ఇక్క‌డి 11 గ్రామాల ప్ర‌జ‌లు త్యాగాలు చేశార‌ని ఆయ‌న తెలిపారు. వారి త్యాగాల‌ను కూడా గొడ్డ‌లి పార్టీ అప‌హాస్యం చేసింద‌న్నారు.

తండ్రీ కొడుకులు..

వైఎస్ కుటుంబానికి చెందిన తండ్రీ కొడుకులు.. 11 సంవ‌త్స‌రాల పాటు వెలిగొండ ప్రాజెక్టుతో ఆడుకున్నార‌ని చంద్ర‌బాబు విమ‌ర్శించారు. వైఎస్ హ‌యాంలో, త‌ర్వాత‌.. జ‌గ‌న్ హ‌యాంలో 2 వేలు కోట్లుమాత్ర‌మే ఖ‌ర్చుచేశారని.. తాము 5.5 కోట్ల రూపాయ‌ల మేర‌కు ఖ‌ర్చు చేశామ‌ని.. నిర్వాసితుల‌కు అన్ని విధాలా సాయం చేశామ‌న్నారు. ఇప్ప‌టికే 763 కోట్ల రూపాయ‌ల‌ను వారికి అందించామ‌న్నారు. మ‌రో 165 కోట్లు మాత్ర‌మే ఇవ్వాల్సి ఉంద‌న్నారు. మ‌రో 169 కోట్ల రూపాయ‌ల‌ను ప్ర‌త్యేక సాయంగా అందిస్తామన్నారు.

చంద్ర‌బాబు అనే నేను..

“చంద్ర‌బాబు నాయుడు అనే నేను.. 1996లో వెలిగొండ‌కు శ్రీకారం చుట్టాను. మ‌ళ్లీ.. దీనిని ప్రారంభించే అవ‌కాశం నాకే ద‌క్క‌డం అదృష్టం. స్థానిక స‌మ‌స్య‌ల‌ను ప‌రిష్క‌రించ‌డ‌లోనూ.. మేం ముందున్నాం.“ అని వివ‌రించారు. వెలిగొండ ప్రాజ‌క్టు కోసం.. భూములు ఇచ్చిన రైతులు, గ్రామ‌స్థుల‌కు పాదాభివంద‌నం చేస్తున్నాన‌ని చంద్ర‌బాబు పేర్కొన్నారు. అన్ని విధాలా ఆదుకుంటున్నామ‌న్నారు. మార్కాపురం జిల్లాను ఇచ్చిన ఘ‌న‌త కూడా త‌మ‌కే ద‌క్కుతుంద‌న్నారు.