పాప్ కార్న్.. ఈ పేరు తెలియని వారు ఉండరు. కాలక్షేపం కోసం తినే ఈ పాప్ కార్న్.. మొక్కజొన్న లోని ప్రత్యేక వెరైటీ నుంచి తయారు చేస్తారు. దీనికి సంబంధించిన పాప్ కార్న్ విత్తనాన్ని తాజాగా ఏపీలో ఆవిష్కరించారు. ఉపరాష్ట్రపతి సీపీ రాధాకృష్ణన్ చేతుల మీదుగా ఏలూరులో జరిగిన కార్యక్రమంలో ఈ సీడ్‌ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు మాట్లాడుతూ.. భవిష్యత్తులో పాప్ కార్న్ పేరు తలుచుకుంటే.. ఏపీ గుర్తొస్తుందని చెప్పారు.
దేశంలో తొలి రసాయన రహిత పాప్‌కార్న్ హైబ్రిడ్ విత్తనం ఏపీలోనే ఆవిష్కృతమైందని సీఎం తెలిపారు. తక్కువ కాలంలో ఎక్కువ పంట పండే ఈ విత్తనాన్ని.. దేశవ్యాప్తంగానే కాకుండా.. ప్రపంచ దేశాలకు కూడా ఎగుమతి చేయనున్నట్టు వివరించారు. ఏలూరులో ఏర్పాటవుతున్న పాప్‌కార్న్ సీడ్ ప్రాసెసింగ్ యూనిట్ ఆసియాలోనే అతిపెద్ద పాప్‌కార్న్ ప్రాసెసింగ్ కేంద్రంగా నిలుస్తోందన్నారు. ఇప్పటికే ఏపీ పాప్ కార్న్ రంగంలో దూసుకుపోతోందని.. గత 11 సంవత్సరాల్లో 65 శాతం వృద్ధి చెందిందన్నారు.
నదుల అనుసంధానం..
నదుల అనుసంధానం విషయాన్ని సీఎం చంద్రబాబు ప్రస్తావించారు. దేశంలో నదుల అనుసంధానం జరగాలని కోరుకుంటున్న వ్యక్తిని తానేనని చెప్పారు. తనలాగానే ఉప రాష్ట్రపతి రాధాకృష్ణన్ కూడా ఆలోచన చేస్తున్నారని, రైతుల నుంచి తాగు నీటి సమస్య పరిష్కారం వరకు కూడా.. నదుల అనుసంధానం అత్యంత కీలకమని పేర్కొన్నారు. పోలవరం ఎడమ కాలువ ద్వారా అనకాపల్లికి ఈ నెలలోనే నీటిని విడుదల చేస్తామని తెలిపారు.
తట్టుకోవచ్చు..
నదులను అనుసంధానం చేయడం ద్వారా ఎల్ నినో వంటి విపత్కర సమస్యలను ఎదుర్కొనవచ్చని సీఎం చంద్రబాబు తెలిపారు. ప్రస్తుతం దేశవ్యాప్తంగా 53 శాతం వరకు వర్షపాతం లోటు ఉందన్నారు. నదుల అనుసంధానం జరిగితే.. సముద్రంలోకి వృథాగా పోయే నీటిని వాడుకునేందుకు అవకావం ఉంటుందని పేర్కొన్నారు. ఇది కొంత ఖర్చుతో కూడుకున్నదే అయినా.. ఎల్ నినో సమస్యతో పోల్చుకుంటే ఇదేం పెద్ద భారం కాబోదని తెలిపారు. ఈ దిశగా కేంద్రం సహకరించాలని ఆయన సూచించారు.
Gulte Telugu Telugu Political and Movie News Updates