లిక్క‌ర్ కేసు… కారుమూరితోనే క‌థ అయిపోలేదు!

వైసీపీ హ‌యాంలో జ‌రిగిన 3500 కోట్ల రూపాయ‌ల లిక్క‌ర్ కుంభ‌కోణం కేసు.. అనేక మ‌లుపులు తిరుగుతోంది. తాజాగా వైసీపీ కీల‌క నాయ‌కుడు కారుమూరి నాగేశ్వ‌ర‌రావును అరెస్టు చేయ‌డం.. ఆయ‌న‌ను కోర్టు ముందు హాజ‌రు ప‌ర‌చ‌డం జ‌రిగాయి. ఈ క్ర‌మంలో వీరి కుటుంబం నుంచి 90 కోట్ల రూపాయ‌ల‌మేర‌కు అధికారులు సీజ్ చేశారు. అలానే ఒక రేంజ్ రోవ‌ర్‌ కారు స‌హా.. ఖ‌రీదైన‌ రోలెక్స్ వాచీల‌ను కూడా స్వాధీనం చేసుకున్నారు. అయితే.. ఈ మ‌ద్య వ్య‌వ‌హారం ఇక్క‌డితో అయిపోలేద‌ని అధికారులు చెబుతున్నారు.

మ‌రింత మంది పాత్ర ఉంద‌ని చెబుతున్న ప్ర‌త్యేక ద‌ర్యాప్తు బృందం(సిట్‌) అధికారులు ఈ వ్య‌వ‌హారంలో సొమ్ములు చేరిన `అంతిమ ల‌బ్ధి`దారు పాత్ర‌ను త్వ‌ర‌లోనే వెల్ల‌డించ‌నున్న‌ట్టు పేర్కొన్నారు. ఇది నిజానికి వైసీపీకి శ‌రాఘాతం వంటి స‌మ‌స్య‌గానే మారుతోంది. నిజానికి ఇప్ప‌టికే క‌సిరెడ్డి రాజ్ స‌హా.. అప్ప‌ట్లో డిస్టిల‌రీ వ్య‌వ‌హారాలు చూసిన మాజీ అధికారి వాసుదేవ రెడ్డి వంటివారిని అరెస్టు చేసి జైలుకు పంపించారు. ఇదే కేసులో మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్క‌ర‌రెడ్డి, ఆయ‌న కుమారుడిని కూడా అరెస్టు చేశారు. ప్ర‌స్తుతం వారు బెయిలుపై ఉన్నారు.

అయితే.. ఇప్పుడు మ‌రో న‌లుగురు కీల‌క నిందితుల కోసం సిట్ అధికారులు ద‌ర్యాప్తును ముమ్మ‌రం చేశారు. ఈ కేసులో ప్ర‌స్తుత రాజంపేట ఎంపీ పెద్దిరెడ్డి మిథున్ రెడ్డికి స‌హ‌క‌రించిన వారు స‌హా.. డిస్టిల‌రీల‌ను ఎంపిక చేయ‌డంతోపాటు.. వాటికి కోటా నిర్దేశించిన వారి జాబితాను కూడా సిద్ధం చేసిన‌ట్టు తెలిసింది. వీటిలో మ‌రో మాజీ మంత్రి పేరు ఉన్న‌ట్టు స‌మాచారం. ప్ర‌స్తుతం ఆయ‌న సైలెంట్ కావ‌డానికి.. ఈ కేసు కార‌ణ‌మ‌న్న వాద‌న వినిపిస్తోంది.

అలానే తాడేప‌ల్లిలో ఉంటూ వైసీపీ వ్య‌వ‌హారాల‌ను చ‌క్క‌బెడుతున్న కీలక నేత పాత్ర కూడా తెర‌మీదికి వ‌చ్చిందని చెబుతున్నారు. వీరికి కూడా త్వ‌ర‌లోనే నోటీసులు ఇవ్వ‌నున్న‌ట్టు తెలిసింది. అయితే.. వీరు త‌మ పాత్ర లేద‌ని ఇప్ప‌టికే చెప్పారు. ఒక్క మాజీ మంత్రి చుట్టూనే మ‌ద్య డిస్టిల‌రీ పాత్ర ఉంద‌ని భావిస్తున్న అధికారులు.. ఆయ‌న‌కు సంబంధించిన స‌మాచారం సేక‌రిస్తున్నారు. ఇది పూర్త‌యితే.. ఆ మాజీ మంత్రిని కూడా అరెస్టు చేయొచ్చ‌ని.. ఈ కేసులో ఇంకా చాలా మంది పేర్లు వినిపిస్తున్నాయ‌ని చెబుతున్నారు. మొత్తం మ‌రో ఆరు మాసాల వ‌రకు ఈ కేసుద‌ర్యాప్తు కొన‌సాగ‌నుంద‌ని అధికారులు తెలిపారు.