ప్రకాశం జిల్లాలో కోలుకోని వైసీపీ

రాష్ట్రంలో టీడీపీ నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండేళ్లు గడిచిపోయాయి. 2024 ఎన్నికల్లో ఉమ్మడి ప్రకాశం జిల్లాలోని 8నియోజకవర్గాల్లో 6 స్థానల్లో టీడీపీ కూటమి విజయం సాధించింది. అప్పటివరకు అధికారంలో వున్న వైసీపీ కేవలం రెండు చోట్ల మాత్రమే అతి కష్టం మీద గెలిచింది. ఒంగోలు పార్లమెంట్ స్థానంలో కూడా టీడీపీ జెండా ఎగరేసింది. ఇది అందరికీ తెలిసిందే. 

ఈ రెండేళ్ల కాలంలో టీడీపీ బలం ఏమాత్రం తగ్గిన దాఖలాలు లేవు. వైసీపీ పుంజుకున్న ఆనవాళ్లు కూడా కనిపించడం లేదు. ఇంకా చెప్పాలంటే ఘోర ఓటమి నుంచి వైసీపీ ఇంకా కోలుకోలేదు.  జిల్లాలోని అన్నీ నియోజకవర్గాల్లో ఆ పార్టీకి నాయకత్వం లేకుండా పోయిన పరిస్థితి కనిపిస్తుంది. ఒంగోలు పార్లమెంట్ కు కనీసం ఇంచార్జిని కూడా నియమించుకోలేని దీనస్థితిలో కొట్టు మిట్టాడుతోంది. గత ఎన్నికల్లో ఇక్కడ నుంచి పోటీ చేసిన చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి నాలుగు రోజులు హడావుడి చేసినప్పటికి ఇప్పుడు ఇటు వైపు తొంగిచూడటం లేదు.  ఈసారి ఎన్నికల్లో కొత్తగా అభ్యర్థిని వెదుక్కోవాల్సిన దుస్థితి వుంది. 

ఇక ఒంగోలు అసెంబ్లీ నియోజకవర్గంలో మాజీ మంత్రి బాలినేని శ్రీనివాస రెడ్డి ఫ్యాన్ స్విచ్చాఫ్ చేసి వెళ్లిపోయాక కార్యకర్తలు ఉక్కపోతతో అల్లాడి పోతున్నారు. చుండూరి రవిబాబు ఇంచార్జిగా పనిచేస్తున్నప్పటికీ పార్టీ శ్రేణులకు నమ్మకం కలిగించలేక పోతున్నాడు. కొండపి నియోజకవర్గంలో మరో మాజీ మంత్రి ఆదిమూలపు సురేష్ ఇష్టం లేని కాపురం చేస్తున్నారు. మాటి మాటికీ పాత ఇంటి వైపు తొంగి చూస్తున్నారు. గిద్దలూరులో కుందూరు నాగార్జున రెడ్డి పరిస్థితి కూడా అంతే. ఆయనకు మార్కాపురం మీదనే మనసుంది.

గిద్దలూరులో పోటీ చేస్తే గెలిచే అవకాశం ఉన్నప్పటికీ అన్నా రాంబాబు మార్కాపురం వదిలి పెట్టనని మంకు పట్టు పడుతున్నారు. ఎర్రగొండపాలెంలో ఎమ్మెల్యే తాటిపర్తి చంద్రశేఖర్ కు ఆదిమూలపు సురేష్ తలనొప్పిగా తయారయ్యాడు. దర్శిలో  వైసీపీ జిల్లా అధ్యక్షుడు బూచేపల్లి శివ ప్రసాద్ కు పార్టీలో సమస్య లేదు కానీ టీడీపీ ఇంచార్జి గొట్టిపాటి లక్ష్మి నుంచి గట్టి పోటీ ఎదురవుతోంది. కనిగిరిలో దద్దాల నారాయణను బలవంతంగా కొనసాగిస్తున్నారని పార్టీ శ్రేణులు చెప్పుకుంటున్నారు. 

ఇకపోతే అద్దంకి నియోజకవర్గం వైసీపీకీ మింగుడు పడటం లేదు. 2019లో కూడా అక్కడ గొట్టిపాటి రవికుమార్ టీడీపీ జెండా ఎగరేశారు. ఇప్పుడు మంత్రిగా మరింత పట్టు సాధించారు. ఇక్కడ వైసీపీకి సీజన్ కు ఒకరు చొప్పున ఇంచార్జిలు మారుతున్నారు. ప్రస్తుతం అశోక్ కుమార్ ఇంచార్జిగా వున్నారు. ఈయన కొనసాగుతారో, కొత్త ఇంచార్జి వస్తాడో కేడర్ కు తెలియదు. కొండపిలో కూడా వైసీపీకి ఒక ఇంచార్జి లేడు. పార్ట్ టైమ్ లీడర్ గా సురేష్ వ్యవహారిస్తున్నట్లు కార్యకర్తలు చెప్పుకుంటున్నారు. ఒంగోలు ఎంపీ సీటు ఖాళీగా వుంది. ఇలాంటి పరిస్థితిలో పార్టీ ఎప్పటికి కోలుకుంటుందో ఏమో అని వైసీపీ శ్రేణులు గొనుక్కుంటున్నారు.