ఉద్యోగాల కోసం ప్రయత్నిస్తున్న యువతకు ఉత్తరప్రదేశ్ డిప్యూటీ సీఎం బ్రజేష్ పాఠక్ చేసిన సూచన ఇప్పుడు వైరల్ అవుతోంది. ఉద్యోగం కోసమే తిరుగుతూ ఉండకుండా E-రిక్షా లేదా ట్యాక్సీ నడుపుకొని సంపాదించుకోవచ్చని ఆయన చెప్పారు. లక్నోలో సెప్టెంబర్ 23న జరిగిన భారత్ ట్యాక్సీ సేవల ప్రారంభ కార్యక్రమంలో మాట్లాడిన పాఠక్.. సొంతంగా వాహనం నడుపుకుంటే ఆదాయంతో పాటు కుటుంబానికి కూడా సమయం ఇవ్వొచ్చని వివరించారు.
ఈ వీడియో సోషల్ మీడియాలోకి రావడంతో ఆయన వ్యాఖ్యలపై రాజకీయంగా కూడా రకరకాల రియాక్షన్స్ మొదలయ్యాయి. రోజంతా ఉద్యోగం చేయడం కంటే నాలుగు గంటలు వాహనం నడిపి, మధ్యాహ్నం ఇంటికి వెళ్లి పిల్లలతో గడపొచ్చని పాఠక్ చెప్పారు. ఆ తర్వాత మళ్లీ సాయంత్రం నుంచి రాత్రి 10 గంటల వరకు ట్యాక్సీ నడిపే అవకాశం ఉంటుందన్నారు. ఉద్యోగం చేస్తే మధ్యాహ్నం ఇంటికి వచ్చి పిల్లలతో రెండు గంటలు కూర్చోగలరా అని ప్రశ్నించారు.
మరొకరి దగ్గర పనిచేయడం కంటే సొంతంగా సంపాదించుకోవడమే మంచిదనే ఉద్దేశంతో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. అయితే ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న యువతకు ఒక డిప్యూటీ సీఎం నుంచి ఇలాంటి సూచన రావడంపై విమర్శలు వస్తున్నాయి. సమాజ్‌వాదీ పార్టీ ఎంపీ పుష్పేంద్ర సరోజ్ కూడా దీనిపై స్పందించారు. దేశాన్ని నడపాల్సిన యువతకు రిక్షా నడపమని చెబుతున్నారంటూ ఆయన విమర్శించారు.
సోషల్ మీడియాలోనూ కొందరు ఉద్యోగ అవకాశాల గురించి ప్రశ్నిస్తుండగా, మరికొందరు స్వయం ఉపాధిని ప్రోత్సహించడంలో తప్పేముందని అభిప్రాయపడుతున్నారు. పాఠక్ ఈ వ్యాఖ్యలు చేసిన కార్యక్రమం కూడా డ్రైవర్లకు సంబంధించినదే. భారత్ ట్యాక్సీ అనేది సహకార విధానంలో నడిచే రైడ్ హైలింగ్ సర్వీస్. ఇందులో డ్రైవర్లను సభ్యులు, భాగస్వాములుగా చేర్చే విధానం ఉంది. ట్యాక్సీలతో పాటు ద్విచక్ర, త్రిచక్ర వాహనాల సేవలను కూడా అందించనున్నారు.
Gulte Telugu Telugu Political and Movie News Updates