యువకుడి చెంప ఛెళ్లుమనిపించిన మంత్రి

ఈ మధ్యకాలంలో కొందరు రాజకీయ నేతలు తమను తాము వేరే లెవల్లో ఊహించుకుంటున్నారు. ప్రజలు ఎన్నుకుంటేనే తాము ప్రజాప్రతినిధులుగా చలామణీ అవుతున్నామన్న సంగతి మరచిపోతున్నారు. తమను ప్రశ్నిస్తున్న జనాలపై భౌతిక దాడులకు పాల్పడుతూ ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఢిల్లీలో తనను ప్రశ్నించిన ఓ యువకుడి చెంప ఛెళ్లు మనిపించాడు మంత్రి పర్వేశ్ వర్మ. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది.

ఢిల్లీ పబ్లిక్ వర్క్స్ డిపార్ట్‌మెంట్ (పీడబ్ల్యూడీ) మంత్రి పర్వేశ్ వర్మ సంయవనం కోల్పోయారు. తిలక్ నగర్‌లో రోడ్డు నాణ్యతను తనిఖీ చేస్తుండగా స్థానిక ఆప్ ఎమ్మెల్యే జర్నైల్ సింగ్‌, స్థానికులు రోడ్డు నాణ్యతపై ప్రశ్నించారు. రోడ్డు నాసిరకం మెటీరియల్ తో తయారైందని, చేత్తో పెరికితే వస్తోందని చూపించారు. ఈ క్రమంలోనే ఆప్ ఎమ్మెల్యే సోషల్ మీడియా యాక్టివిస్ట్ సాహెబ్ సింగ్ తన ఫోన్‌లో వీడియో తీశాడు. దీంతో, కోపంతో ఊగిపోయిన మంత్రి…సదరు యువకుడి ఫోన్‌ లాక్కొని చెంప ఛెళ్లుమనిపించాడు.

ఆ తర్వాత మంత్రి భద్రతా సిబ్బంది జోక్యం చేసుకుని ఇద్దరినీ విడదీశారు. అయితే, ఈ వ్యవహారంపై సాహెబ్ సింగ్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. రోడ్డు అధ్వాన్నంగా ఉందని, అందుకే వీడియో రికార్డ్ చేస్తుండగా మంత్రి తనపై దాడి చేశారని ఫిర్యాదులో పేర్కొన్నారు. తన ఫోన్ లాక్కున్నారని, భద్రతా సిబ్బంది, బీజేపీ కార్యకర్తలు తనను బెదిరించారని ఆరోపించాడు. ఈ క్రమంలోనే ఈ వ్యవహారంపై వికాస్‌పురి పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది. పోలీసులు విచారణ చేస్తున్నారు.

మరోవైపు, పర్వేశ్ పై తక్షణమే చర్యలు తీసుకోవాలని మాజీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ డిమాండ్ చేశారు. అయితే, పర్వేశ్ వెర్షన్ మరోలా ఉంది. ఆప్ కార్యకర్తలు తన కుటుంబ సభ్యులను తీవ్రమైన పదజాలంతో దూషించారని, ఆ ఆవేశంలోనే తాను అలా స్పందించానని వివరణనిచ్చారు. ఇక, ఆప్ ఎమ్మెల్యే జర్నైల్ సింగ్ కాంట్రాక్టర్ నుంచి కమీషన్ల కోసం ఒత్తిడి చేస్తున్నారని ఆరోపించారు.