రాష్ట్ర ప్రభుత్వం విజయవంతంగా నిర్వహించిన డీఎస్సీ పరీక్షల నిర్వాహణపై ప్రతిపక్ష వైసీపీ రాద్దాంతం చేస్తున్న విషయం తెలిసిందే. ఆధారాలు లేకుండా అక్రమాలు జరిగాయంటూ చేస్తున్న తప్పుడు ప్రచారంపై అసెంబ్లీలో చర్చించేందుకు సిద్ధంగా ఉన్నామని ముఖ్యమంత్రి చంద్రబాబు, విద్యాశాఖ మంత్రి లోకేష్ విసిరిన సవాల్ కు మాత్రం వైసీపీ స్పందించడం లేదు. చివరికి డీఎస్సీ అభ్యర్థులు సైతం వైసీపీ తీరును నిరసిస్తూ ర్యాలీలు చేస్తున్నారు. దేశ చరిత్రలో ఒక ప్రతిపక్ష పార్టీకి వ్యతిరేకంగా ర్యాలీలు చేయడం ఇదే మొదటిసారి. ప్రభుత్వం మీద బురద చల్లడమే పనిగా వైసీపీ కుట్రలు చేస్తుందని విమర్శలు వినిపిస్తున్నాయి. ఈ తరుణంలో ఢిల్లీ మంత్రి ఒకరు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్వహించిన డీఎస్సీ పరీక్షల కితాబివ్వడం విశేషం.
ఢిల్లీ పరిశ్రమల శాఖా మంత్రి సర్దార్ మంజిందర్ సింగ్ మంగళవారం రాష్ట్రంలో పర్యటించారు. రాష్ట్ర సచివాలయంలో రాష్ట్ర విద్యా,ఐటి శాఖల మంత్రి నారా లోకేష్ ను కలిశారు. ఈ సందర్బంగా ఆయన డీఎస్సీ పరీక్షల గురించి వాకబు చేశారు. రాష్ట్ర ప్రభుత్వం డీఎస్సీ పరీక్షలను పారదర్శకంగా నిర్వహించడమే కాకుండా ఒకేసారి 16 వేల మందికి ఉద్యోగాలు ఇవ్వడం పై ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ఎలాంటి ఇబ్బందులు, సమస్యలు లేకుండా ప్రశాంతంగా ఉద్యోగ నియామకాలు చేపట్టారని ప్రశంసలు కురిపించారు. అదే ఢిల్లీలో అయితే టీచర్ ఉద్యోగ నియామకాలు అంటేనే కొరివితో తలగోక్కున్నట్లు ఉంటదని, కేసులు పెట్టి, ఫిర్యాదులు చేసి గందరగోళం సృష్టిస్తారని తెలిపారు.
ఇప్పుడు దేశంలో ఉద్యోగ నియామకాల పరీక్షలపై అనేక రాష్ట్రాల్లో ఇదే పరిస్థితి వుంది. ఢిల్లీ, జార్ఖండ్, బీహార్ రాష్ట్రాల్లో విద్యార్థులు చేసిన ఉద్యమం దీనికి నిదర్శనం. ముఖ్యంగా ఉపాధ్యాయ ఉద్యోగాలకు సంబందించి పరీక్షల నిర్వహణ కత్తిమీద సాములా తయారైంది . అలాంటి క్లిష్టమైన పరిస్థితుల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో డీఎస్సీ పరీక్షలు ప్రశాంతంగా జరగడం పట్ల ఢిల్లీ రాష్ట్ర ప్రభుత్వంతో పాటు అనేక రాష్ట్రాలు ఆసక్తిగా గమనిస్తున్నాయి. వైసీపీ చేస్తున్న ఆరోపణలను ఒట్టి రాజకీయ విమర్శలుగా కొట్టి పడేస్తున్నాయి. ఈ ఉత్సాహంతోనే మంత్రి లోకేష్ మరో మూడు వేల ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి రంగం సిద్ధం చేస్తున్నారు. నిరుద్యోగులకు ఇచ్చిన మాట నిలుపుకుంటున్నాడని రాష్ట్రంలోని విద్యార్థులు, యువకులు చెప్పుకుంటున్నారు.
Gulte Telugu Telugu Political and Movie News Updates