జండా పండగ జరుపుకోలేదా జగన్?

స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని దేశమంతా జాతీయ పతాకాన్ని ఎగరేయడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు అమరావతి లోని రాయపూడి గ్రౌండ్స్ లో రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహించిన స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొన్నారు. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కాకినాడ పోలీస్ పరేడ్ గ్రౌండ్ లో సతీమణితో కలిసి పాల్గొన్నారు. కానీ ప్రతిపక్ష హోదా కావాలని అడుగుతున్న మాజీ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొన్నట్టు కనిపించలేదు.

ఒక పార్టీ అధ్యక్షుడిగా జాతీయ పతాకాన్ని ఎగరేసినట్లు ఎలాంటి సమాచారం రాలేదు. ఫోటోలు కానీ వీడియో కానీ విడుదల చేయలేదు. పైగా తాడేపల్లిలోని వైసీపీ కేంద్ర కార్యాలయంలో జరిగిన స్వాతంత్ర్య వేడుకలకు గైర్హాజరయ్యారు.

శనివారం తాడేపల్లి లోని వైసీపీ కార్యాలయంలో స్వాతంత్ర్య వేడుకలు నిర్వహించారు. జగన్ స్థానంలో శాసన మండలిలో విపక్షనేతగా వ్యవహారిస్తున్న బొత్సా సత్యనారాయణ జాతీయ జెండా ను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ లేళ్ళ అప్పిరెడ్డి, సీనియర్ నాయకులు మురుగుడు హనుమంతరావు హాజరయ్యారు.

జగన్ ఆదేశాలతో రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ కార్యాలయాల్లో స్వాతంత్ర్య వేడుకలు నిర్వహించారు. జగన్ సోషల్ మీడియా వేదిక ఎక్స్ లో ప్రజలకు స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు తెలపడం గమనార్హం.

ఆగస్టు, 15 వేడుకల్లో జగన్ కనిపించకుండా పోయేసరికి రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతుంది. ఇంతకూ జగన్ ఎక్కడ వున్నారు, ఎక్కడికి వెళ్లి వుంటారని వైసీపీ శ్రేణులు చెవులుకొరుక్కుంటున్నారు. వీకెండ్ కాబట్టి బెంగళూరులోని తన నివాసానికి వెళ్లి ఉండొచ్చని గుసగుసలు వినిపిస్తున్నాయి. ఎంతో ప్రాముఖ్యం కలిగిన స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలకు సంబంధించి ఎలాంటి ఫొటోలు వీడియోలు రాకపోవడంతో అసలు జగన్ జండా పండగ జరుపుకున్నారా లేదా అనే అనుమానాలు పుట్టుకొస్తున్నాయి.