గుంటూరులోని తూర్పు, పడమర నియోజకవర్గాల్లో వైసీపీ తన ప్రభావం, ప్రాభవం కూడా కోల్పోయింది. రెండున్నరేళ్ల కాలంలో పార్టీ ఘోరంగా దెబ్బతిందన్న వాదన వినిపిస్తోంది. తూర్పు నియోజకవర్గంలో వరుస విజయాలు దక్కించుకున్న ముస్తాఫా ఒత్తిడికి తలొగ్గిన పార్టీ.. గత ఎన్నికల్లో ఆయన కుమార్తెకు అవకాశం ఇచ్చింది. ఆమె పరాజయం పాలయ్యారు. గెలుపు ఓటములు సహజమే అయినా.. పార్టీకేడర్‌ను తనకు అనుకూలంగా మార్చుకోవడంతో ఆమె విఫలమయ్యారు. అంతర్గత వివాదాలతో ముందుకు సాగుతున్నారు.
మరోవైపు పొగాకు వ్యాపారానికి సంబంధించి తాజాగా చేసిన తప్పు.. ముస్తఫాను జైలు పాలు చేసింది. ఈ పరిణామం మైనారిటీ వర్గాన్ని కూడాకుదిపివేయడంతో వారు కూడా మౌనంగా ఉన్నారు. నిజానికి ముస్తఫా అంటే.. మైనారిటీ వర్గాల్లో మంచి పేరు తెచ్చుకున్నారు. కానీ, ఇటీవల వెలుగు చూసిన కిడ్నాప్ వ్యవహారంతో ఆయన పేరు మసక బారింది. ఫలితంగా తూర్పులో వైసీపీ గత ప్రభావాన్ని పూర్తిగా కోల్పోయిందన్న వాదన పార్టీలో వినిపిస్తోంది. ఈ కేసు నుంచి ముస్తఫా బయటపడినా.. ఆయనకు ఏమేరకు సానుభూతి దక్కుతుందన్నది ప్రశ్నగా మారింది.
ఇక, గుంటూరు వెస్ట్‌లో కూడా.. వైసీపీ వేసిన ఒకే ఒక్క అడుగు తీవ్ర విపరిణామాలకు దారితీసింది. వ్యాపార వర్గాలు, సంపన్న వర్గాలు ఎక్కువగా ఉన్న పశ్చిమ నియోజకవర్గంలో 2019లో విజయం దక్కించుకున్న మద్దాలి గిరిధర్‌ను 2024 ఎన్నికల్లో టికెట్ ఇవ్వకుండా తప్పించి పార్టీ తప్పు చేసిందన్న వాదన వినిపించింది. అంతేకాదు.. ఎన్నో ఆశలతో ఇక్కడ పోటీ చేసిన ఆనాటి మంత్రి రజనీ కూడా ఐపు లేకుండా పోయారు. దీంతో పశ్చిమ పరిస్థితి కూడా కొరుకుడు పడడం లేదు.
ఈ రెండు నియోజకవర్గాలు వైసీపీకి ఒకప్పుడు.. బలంగా ఉండగా.. ఇప్పుడు మైనస్ కావడం గమనార్హం. మరోవైపు.. టీడీపీ తరఫున విజయం దక్కించుకున్న పశ్చిమ, తూర్పు ఎమ్మెల్యేలు దూకుడుగా వ్యవహరిస్తున్నారు. దీంతో పార్టీ కార్యక్రమాలు, ప్రభుత్వ కార్యక్రమాలు కూడా జోరుగా సాగుతున్నాయి. అదే సమయంలో వైసీపీ కేడర్ కూడా ఆయా ఎమ్మెల్యేలకు జై కొట్టడం మరో దెబ్బగా మారింది. మొత్తంగా గుంటూరు పడమర- తూర్పు నియోజకవర్గాల్లో వైసీపీకి ఇప్పుడు బిగ్ టెస్టే ఎదురు కానుంది. మరి ఏం చేస్తారన్నది చూడాలి.
Gulte Telugu Telugu Political and Movie News Updates