కేసీఆర్ అంచ‌నాకు చిక్క‌ని రేవంత్‌!

ఎలాంటి నాయ‌కుడినైనా.. ఎలాంటి పార్టీనైనా త‌న కంటిచూపుతో అంచ‌నా వేయ‌గ‌ల రాజ‌కీయ దురంధ‌రుడిగా మాజీ సీఎం, తెలంగాణ నాయ‌కుడు, బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్‌కు పేరుంది. అయితే.. ఆయ‌న అంచ‌నాలు ఇత‌ర నాయ‌కుల విష‌యంలోను, ఇత‌ర పార్టీల విష‌యంలోనూ స‌క్సెస్ అయ్యాయేమోకానీ.. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి విష‌యంలో ప‌ట్టు త‌ప్పుతున్నాయ‌ని అంటున్నారు విశ్లేషకులు. కేసీఆర్ అంచ‌నాల‌కు రేవంత్ రెడ్డి రాజ‌కీయాలు మింగుడు ప‌డ‌డం లేద‌ని చెబుతున్నారు.

2023లో ప్ర‌భుత్వాన్ని ఏర్పాటు చేసిన త‌ర్వాత‌.. కూడా రేవంత్ రెడ్డిని బ‌చ్చా అంటూ కేసీఆర్ వ్యాక్యానించారు. ఇక , బీఆర్ ఎస్ పెద్ద నేత‌లు కూడా రేవంత్ రెడ్డి కాదు.. ర‌వ్వంత‌ రెడ్డి అంటూ ఎద్దేవా చేశారు. అయితే.. ఈ వ్యాఖ్య‌లకు ఒక‌వైపు ప‌దునైన స‌మాధానం చెబుతూనే.. మ‌రోవైపు త‌న పాల‌నతో.. రేవంత్ ఈ విమ‌ర్శ‌ల‌కు చెక్ పెడుతున్నారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక నుంచి స్థానిక సంస్థ‌ల ఎన్నిక‌ల వ‌ర‌కు.. కాంగ్రెస్ విజ‌యాన్ని రేవంత్ రెడ్డి శాసించారు. అదేస‌మ‌యంలో బీసీల గ‌ణ‌న ద్వారా ఆ వ‌ర్గాన్ని చేరువ చేసుకునే ప్ర‌య‌త్నం చేశారు.

ఇక‌, హైడ్రా వ్య‌వ‌స్థ అనేది రేవంత్‌కు మేలు మ‌లుప‌నే చెప్పాలి. దీనిపై అనేక విమ‌ర్శ‌లు వ‌చ్చినా.. ఆయ‌న ముందుకేసాగారు. రైతుల‌కు రుణ హామీ నుంచి ఉద్యోగుల బ‌కాయిల వ‌ర‌కు కూడా.. కేసీఆర్ దాడి చేయాల‌ని అనుకున్నా .. సీఎంగా రేవంత్ ఆ అవ‌కాశం ఇవ్వ‌కుండా జాగ్ర‌త్త ప‌డ్డారు. ఇక‌, రాజ‌కీయంగా పైచేయి సాధించేందుకు జంపింగుల‌పై కేసీఆర్ అండ్ కో న్యాయ‌పోరాటానికి దిగిన‌ప్పుడు కూడా.. రేవంత్ వెనుకంజ వేయ‌కుండా ముందుకే సాగారు. ప్ర‌స్తుతం దానం నాగేంద‌ర్ వ్య‌వ‌హారంలోనూ సుప్రీంకు వెళ్లారు.

విమ‌ర్శ‌లు.. ప్ర‌తి విమ‌ర్శ‌లు..

స‌హ‌జంగా ప్ర‌భుత్వంలో ఉన్న‌వారికి ప‌నిభారం పెరుగుతుంది. త‌ద్వారా ప్ర‌తిప‌క్షాలు చేసే విమ‌ర్శ‌ల‌పై ఘాటుగా సమాధానం చెప్పేందుకు ఒకింత త‌ట‌ప‌టాయింపు ఉంటుంది. పైగా బీఆర్ ఎస్ అగ్ర‌నేత‌లు నిత్యం మీడియా ముందుకు రావ‌డం కూడా స‌ర్కారుకు ఇబ్బందేన‌ని అంచ‌నా వేసుకున్నారు. కానీ, అనూహ్యంగా.. రేవంత్ ఈ విష‌యంలోనూ పైచేయి సాధించారు. ఎక్క‌డిక‌క్క‌డ ప్ర‌తిప‌క్ష నేత‌ల‌ను ఎండ‌గ‌డుతున్నారు. తాజాగా 22ఏ భూముల వ్య‌వ‌హారాన్ని బీఆర్ఎస్ రాజ‌కీయంగా త‌మ‌కు అనుకూలంగా మార్చుకునే ప్ర‌య‌త్నం చేసింది.

కానీ.. దీనినే అడ్డు పెట్టి.. బీఆర్ఎస్ నాయ‌కుల భూముల‌పై విచార‌ణ‌కు సీఎం ఆదేశించారు. దీంతో ఎందుకు ఈ విష‌యాన్ని ప్ర‌స్తావించి పెద్ద‌ది చేశామ‌నే చ‌ర్చ బీఆర్ఎస్ నాయ‌కుల మ‌ధ్య త‌లెత్తేలా చేశారు. మ‌హిళ‌ల‌కు ఉచిత బ‌స్సు, ఉద్యోగాల క‌ల్ప‌న ద్వారా నిరుద్యోగుల క‌ల‌లు నెర‌వేరుస్తూ.. మ‌రోవైపు.. స‌ర్కారు త‌ర‌ఫున సంక్షేమాన్ని అమ‌లు చేస్తుండ‌డంతో బీఆర్ఎస్ వ్యూహాల‌కు రేవంత్ రెడ్డి ఎక్క‌డా చిక్క‌క పోగా.. ఎదురు దాడిని తీవ్రం చేయ‌డం గ‌మ‌నార్హం. అటు అసెంబ్లీలోను.. ఇటు బ‌య‌ట కూడా రేవంత్ రాజ‌కీయాల‌తో బీఆర్ ఎస్ ఉక్కిరి బిక్కిరి అవుతుండ‌డం గ‌మ‌నార్హం.