మొన్న ఉచితాలు.. నేడు విగ్ర‌హాలు.. అమెరికా పాలిటిక్స్ హీట్‌!

అగ్ర‌రాజ్యం అమెరికాలో మ‌ధ్యంత‌ర అధ్య‌క్ష ఎన్నిక‌లు కాక రేపుతున్నాయి. ప్ర‌త్య‌ర్థుల‌పై పైచేయి సాధించేందుకు పార్టీలు.. అనేక ప్ర‌యాస‌లు ప‌డుతున్నాయి. అదే స‌మ‌యంలో వివాదాల‌కు కూడా దిగుతున్నాయి. మొన్న‌టికి మొన్న అధ్య‌క్షుడు ట్రంప్‌.. యువ‌త‌కు ఏటా 5 వేల డాల‌ర్ల‌ను ఉచితంగా పంపిణీ చేస్తామ‌ని చెప్పిన విష‌యం తెలిసిందే. దీనిపై ట్రోల్స్ కూడా వ‌చ్చాయి. అయినా.. ఆయ‌న వెన‌క్కి త‌గ్గ‌లేదు. ఇదే అమెరికాలో తొలి ఉచిత ఆర్థిక హామీ కావ‌డం గ‌మ‌నార్హం.

ఈ ఉచిత హామీ వ్య‌వ‌హారంపై ఒక‌వైపు చ‌ర్చ జ‌రుగుతున్న స‌మ‌యంలో ఇప్పుడు విగ్ర‌హాల రాజ‌కీయం కూడా అమె రికాను కుదిపేస్తోంది. ప్ర‌స్తుతం అమెరికాలోని భార‌తీయ సంత‌తి ఓట‌ర్లు.. ట్రంప్ విధానాల‌ను వ్య‌తిరేకిస్తున్నారు. దీంతో వీరంతా డెమొక్రాట్ల‌కు మ‌ద్ద‌తు ఇస్తున్నారు. ఇది.. అధికార రిప‌బ్లిక‌న్‌ల‌కు మంటెత్తిస్తోంది. దీంతో డెమొక్రాట్ల‌కు మ‌ద్ద‌తు ఇస్తున్న ప్ర‌వాస భార‌తీయుల‌పై చెణుకులు విసురుతున్నారు. అదేస‌మ‌యంలో ఆల‌యాలు, విగ్రహా ల‌పైనా కామెంట్లు చేస్తున్నారు.

తాజాగా టెక్సాస్‌లో ఉన్న 90 అడుగుల ఆంజ‌నేయ స్వామి వారి విగ్ర‌హం చుట్టూ.. రాజ‌కీయ దుమారం రేపింది. రిప‌బ్లిక‌న్ మ‌ద్ద‌తుదారు, ప్ర‌ముఖ యూట్యూబ‌ర్ జెస్సీ హూజెస్ తీవ్ర వ్యాఖ్య‌లు చేశారు. హ‌నుమాన్ విగ్ర‌హాన్ని సోష‌ల్ మీడియాలో పోస్టు చేసిన ఆయ‌న‌.. తాము గెలిచిన త‌ర్వాత‌.. ఇక్క‌డి విగ్ర‌హాన్ని తొల‌గిస్తామ‌ని వ్యాఖ్యానించారు. వాస్త‌వానికి ఈ విగ్ర‌హాన్ని స్థానిక డెమొక్రాట్ల మ‌ద్ద‌తుతో హిందూ సామాజిక వ‌ర్గాలు ఏర్పాటు చేసుకున్నాయి. ఇది ట్రాఫిక్‌కు కూడా అంత‌రాయం క‌లిగించ‌డం లేదు.

అయితే.. త‌మ‌కు మ‌ద్ద‌తు ఇవ్వ‌కుండా.. హిందూ వ‌ర్గాలు డెమొక్రాట్ల‌కు మ‌ద్ద‌తు ఇవ్వ‌డం ప‌ట్ల రిప‌బ్లిక‌న్ మ‌ద్ద‌తు దారులు ఆగ్ర‌హంతో ఉన్నారు. దీంతోమీ విగ్ర‌హాల‌ను కూల్చేస్తామ‌ని హెచ్చ‌రిక‌లు చేస్తున్నారు. ఈ ప‌రిణామాల‌తో రాజ‌కీయాలు వేడెక్కాయి. రిప‌బ్లిక‌న్ హెచ్చ‌రిక‌ల‌ను డెమొక్రాట్లు ఖండిస్తున్నారు. హిందూ వ‌ర్గాల‌కు తాము అండ‌గా ఉంటామ‌ని హామీ ఇస్తున్నారు. మొత్తంగా.. ఇటీవ‌ల ఉచిత ప‌థ‌కాలు.. ఇప్పుడు విగ్ర‌హాల ధ్వంసాలు వంటివి పెద్ద ఎత్తున చ‌ర్చ‌కు దారితీస్తున్నాయి.