వరుసగా మూడో పర్యాయం కేంద్రంలో అధికారంలోకి వచ్చిన నరేంద్ర మోడీ సర్కారు మీద చాలా ఏళ్ల నుంచి అలుపెరగని పోరాటం చేస్తున్నాడు నటుడు ప్రకాష్ రాజ్. ఆయన రాజకీయాల్లో ఉన్నదే మోడీ ప్రభుత్వం మీద పోరాటానికే అన్నట్లుగా ఉంటుంది తన వ్యవహారం. మోడీకి వ్యతిరేకంగా ఉనన వాళ్లు ఆయనకు మిత్రులు. అదే సమయంలో మోడీ మిత్రులంతా తన శత్రువులే అన్నట్లుగా వ్యవహరిస్తుంటాడు.
2019 ఎన్నికల్లో ఆయన బెంగళూరు నుంచి ఎంపీగా కూడా పోటీ చేశారు కూడా. డిపాజిట్ రాకపోయినా సరే.. రాజకీయాల్లో తన పోరాటాన్ని కొనసాగిస్తున్నారు. ఈ మధ్య కాక్రోచ్ జనతా పార్టీకి ఆయన మద్దతుదారుగా మారిన సంగతి తెలిసిందే. ఆ పార్టీ ఆందోళనలతో కేంద్ర విద్యా మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయడంతో ప్రకాష్ రాజ్ ఆనందానికి అవధుల్లేవు. ఇలాంటి టైంలో ప్రకాష్ రాజ్ చేతికి ఇంకో ఆయుధాన్నిచ్చింది కేంద్ర ప్రభుత్వం.
ఎస్ఐఆర్‌లో భాగంగా దేశవ్యాప్తంగా లక్షల్లో ఓట్లు రద్దవుతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే బెంగళూరులో ప్రకాష్ రాజ్ ఓటు కూడా గల్లంతయిందట. ఈ విషయాన్ని ప్రకాష్ రాజే ఒక వీడియో ద్వారా వెల్లడించారు. ఈ విషయాన్ని వెల్లడిస్తున్నపుడు ఆయన ఆనందం చూస్తే.. భలే ఛాన్స్ దొరికింది అన్నట్లే ఉంది. తాను పుట్టి పెరిగిన, చదువు కూడా పూర్తి చేయడమే కాక ఎంపీగా పోటీ కూడా చేసిన నియోజకవర్గంలో తన ఓటు తీసేశారని ఆయన వెల్లడించారు.
మీకు ఓటు వేయని వాళ్ల ఓట్లు తీసేస్తారు కానీ.. మిమ్మల్ని గద్దె దించకుండా మాత్రం మమ్మల్ని ఆపలేరు అని ఆయన వ్యాఖ్యానించారు. ఈ వీడియోలో అంతటా ఆయన నవ్వుతూనే ఉన్నారు. ఆ నవ్వు చూస్తే నా ఓటు తీయడం ద్వారా భలే ఆయుధాన్నిచ్చారు, దీని మీద ఎంత రచ్చ చేస్తానో చూడండి అన్నట్లే ఉంది. ఇది ప్రకాష్ రాజ్‌కే కాదు, ప్రతిపక్షాలన్నింటికీ ఆయుధం లాంటిదే. మరి ప్రకాష్ రాజ్ ఓటు తీసేయడంపై ఎన్నికల కమిషన్ అధికారులు ఏమని బదులిస్తారో చూడాలి.
Gulte Telugu Telugu Political and Movie News Updates