డాక్టర్ కావాలనే ప్రియాంక కల… కలగానే మిగిలిపోయింది..!

ఏపీలోని రాజమహేంద్రవరం నగరంలో ఇటీవల చోటుచేసుకున్న హిట్ అండ్ రన్ కేసు ఆదివారం కీలక మలుపు తిరిగింది. ఈ కేసులో తీవ్రంగా గాయపడి ప్రాణాపాయ స్థితిలో ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్న ప్రియాంక ఆదివారం మృతి చెందారు. దీంతో ఆమె కుటుంబం తీవ్ర విషాదంలో మునిగిపోయింది. అదే సమయంలో ప్రియాంక బైక్ ను కారుతో గుద్దిన ఇందరు నిందితులు సుందరపు దుష్యంత్, ఆండక్రూ విలియం జోసెఫ్ లను ఇప్పటికే అరెస్టు చేసిన రాజమహేంద్రవరం పోలీసులు వారిపై ఇదివరకు నమోదు అయిన హిట్ అండ్ రన్ కేసును కాస్తా హత్యాయత్నం, హత్య కేసుగా మారిపోయింది. ప్రియాంకను ఉద్దేశపూర్వకంగానే హత్య చేసిన నిందితులకు కఠిన శిక్ష పడేలా చేస్తామని పోలీసులు చెబుతున్నారు.

ఈ ఘటన పూర్తి వివరాల్లోకి వెళితే… డెర్మటాలజీలో పీజీ చేస్తున్న ప్రియాంక ఈ నెల 3న రాజమహేంద్రవరంలోని ప్రసాద్ ఆదిత్య మాల్ సమీపంలో స్కూటిపై వెళుతుండగా… ఆమెను కారుతో వెంబడించిన ఇద్దరు యువకులు ఆమె బైకును పదే పదే గుద్దారు. ఆ క్రమంలో కిందపడిపోయిన ప్రియాంక తలపై కారును పోనిచ్చారు. దీంతో తీవ్రంగా గాయపడ్డ ప్రియాంకను తొలుత అక్కడే ఓ ఆసుపత్రికి తరలించిన ఆమె కుటుంబ సభ్యులు మెరుగైన చికిత్స కోసం సికింద్రాబాద్ లోని కిమ్స్ ఆసుపత్రికి తరలించారు. అయితే గాయాలు తీవ్రవైమని కావడంతో ఆమె బ్రెయిన్ డెడ్ అయినట్లు వైద్యులు తెలిపారు. ఆ తర్వాత ఆదివారం మధ్యాహ్నం ఆమె చనిపోయారు. దీనితో డాక్టర్ కావాలనే ప్రియాంక కల.. కలగానే మిగిలిపోయింది.

ఇదిలా ఉంటే… ఈ ఘటనను కేవలం హిట్ అండ్ రన్ కేసుగా భావించిన పోలీసులు ఆ మేరకే కేసులు నమోదు చేశారు. అయితే ప్రియాంక స్కూటీని గుద్దిన కారుకు నెంబర్ ప్లేట్ లేకపోవడాన్ని గుర్తించిన పోలీసులు.. ఘటనపై మరింత లోతుగా దర్యాప్తు చేశారు. ఈ క్రమంలో ఇటీవలే షాపింగ్ మాల్ లో ప్రియాంకతో నిందితులిద్దరికీ వాగ్వాదం జరిగిందని తేలింది. తమతోనే గొడవకు దిగుతుందా? అంటూ ఆవేశానికి గురైన నిందితులు ప్రియాంకను ఎలాగైనా చంపేయాలని పకడ్బందీ ప్లాన్ వేశారు. అందులో భాగంగానే హిట్ అండ్ రన్ ఘటనగా చిత్రీకరించేందుకు ప్లాన్ చేశారు. అయితే ఘటనలో చనిపోయింది ఓ మెడికో కావడంతో పోలీసులు లోతైన దర్యాప్తు చేసి అసలు వాస్తవాలను వెలికి తీశారు.