రేప్ కేసులో `తెహ‌ల్కా` మాజీ ఎడిట‌ర్ దోషి!

`తెహ‌ల్కా`.. ఒక‌ప్పుడు ఈ పేరంటే రాజ‌కీయ నేత‌లకు.. లంచాల‌కు మ‌రిగిన అధికారుల‌కు గుండెల్లో రైళ్లు ప‌రిగెట్టేవి. ప‌రిశోధ‌నాత్మ‌క జ‌ర్న‌లిజానికి అప్ప‌టి వ‌ర‌కు ఎన‌లేని ప్రాధాన్యం తీసుకువ‌చ్చిన మీడియా తెహ‌ల్కా. 2జీ స్పెక్ట్ర‌మ్ కుంభ‌కోణం నుంచి బొగ్గు గ‌నుల కుంభ‌కోణం వ‌ర‌కు అనేక కుంభ‌కోణాల‌ను తెహ‌ల్కా వెలుగులోకి తీసుకువ‌చ్చింది. అలానే.. భోపాల్ గ్యాస్ బాధితుల వెనుక‌.. రాజ‌కీయ నేత‌లు చేసిన కుట్ర‌లను కూడా క‌ళ్ల‌కు క‌ట్టిన‌ట్టు వివ‌రించింది.

అలాంటి వార్త‌లు, క‌థ‌నాలు, సంచ‌ల‌నాల‌తో ప‌త్ర‌కను ఎన‌లేని స్థాయికి తీసుకువెళ్లిన అప్ప‌టి ఎడిట‌ర్ త‌రుణ్ తేజ్‌పాల్. అయితే.. ఆయ‌న ఎంత ఎదిగినా.. ఆయ‌న చేసిన ఓ వ్య‌వ‌హారం.. పీక‌ల‌కు చుట్టుకుంది. ట్రైనీగా ఉన్న ఓ మ‌హిళా జ‌ర్న‌లిస్టుపై అత్యాచారం చేశార‌న్న‌ది ప్ర‌ధాన ఆరోప‌ణ‌. గోవాలో అధ్య‌యన ప‌ర్య‌ట‌న‌కు వెళ్లిన స‌మ‌యంలో మ‌హిళా జ‌ర్న‌లిస్టుపై తేజ్‌పాల్ 2013లో అత్యాచారం చేశార‌న్న ఫిర్యాదు తో కేసు న‌మోదైంది. దీనిపై 2021లోనే తీర్పు వ‌చ్చింది.

అయితే.. అప్ప‌టి కేసులో తేజ్‌పాల్ నిర్దోషి అని.. కేవ‌లం మ‌హిళా జ‌ర్న‌లిస్టు సంచ‌ల‌నం కోస‌మే ఆయ‌న పై ఫిర్యాదు చేశార‌ని కోర్టు తీర్పు వెలువ‌రించింది. దీంతో అప్ప‌టికే అరెస్ట‌యి జైల్లో ఉన్న తేజోపాల్.. అ నంత‌రం బెయిల్‌పై బ‌య‌ట‌కు వ‌చ్చారు. కానీ, ఈ కేసును మ‌హారాష్ట్ర ప్ర‌భుత్వం సీరియ‌స్‌గా తీసుకుంది. దీంతో స్థానిక కోర్టు ఇచ్చిన తీర్పును హైకోర్టులో స‌వాల్ చేసింది. ఈ కేసును పూర్తిగా అధ్యయ‌నం చేయ‌డంతోపాటు.. పున‌ర్విచార‌ణ కూడా చేప‌ట్టిన హైకోర్టుతాజాగా తేజోపాల్‌ను దోషిగా తేల్చింది. కాగా.. ఒక రేప్‌లో కేసు ఒక ప‌త్రిక ఎడిట‌ర్‌.. ఇలా దోషి కావ‌డం ఇదే తొలిసారి.

62 ఏళ్ల తేజోపాల్‌కు విస్తృత‌మైన భాషా ప‌రిజ్ఞానంతోపాటు.. ప‌రిశోధ‌నాత్మ‌క జ‌ర్న‌లిజంపై మ‌క్కువ ఎక్కువ. దీంతో ఆయ‌న అనేక మంది జ‌ర్న‌లిస్టుల‌ను కూడా త‌యారు చేశారు. అనేక కేసుల‌ను కూడా వెలుగులోకి తీసుకువ‌చ్చారు. పీవీ న‌ర‌సింహారావు ప్ర‌ధానిగా ఉండ‌గా.. జేఎంఎం ముడుపుల కేసు స‌హా.. 2జీ స్ప్రెక్ట్రం, బొగ్గుగ‌నులు, బీహార్ మాజీ సీఎం లాలూ ప్ర‌సాద్ యాద‌వ్ జైలుకు వెళ్లాల్సి వ‌చ్చిన గ‌డ్డి కుంభ‌కోణం స‌హా అనేక కేసుల‌ను తేజోపాల్ వెలుగులోకి తీసుకువ‌చ్చారు.