స్థాలిన్ కూడా నోరు జారితే ఎలా?

గత ఎన్నికల్లో ఓటమి పాలైన డీఎంకే అధినేత స్థాలిన్ దాన్నుంచి ఎలాంటి గుణపాఠం నేర్చుకున్నట్లు లేదు. ఆయన, ఆయన కుమారుడు తరచుగా మహిళల గురించి వివాదాస్పద వ్యాఖ్యలు చేసి విమర్శల పాలవుతున్నారు. స్థాలిన్ కానీ ఆయన కుమారుడు ఉదయనిధి కానీ కేవలం ఒక పార్టీ నాయకులు మాత్రమే కాదు. ఒకరు మాజీ ముఖ్యమంత్రి అయితే మరొకరు మాజీ ఉప ముఖ్యమంత్రి. అంటే హుందాగా వ్యవహారించాల్సిన బాధ్యత వుంది. ఎందుకో కానీ స్థాయికి తగ్గట్టుగా ప్రవర్తించలేక పోతున్నారు. జనం ముందు అభాసు పాలవుతున్నారు.

ఈ ఏడాది ఆరంభంలో జరిగిన తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో సత్యభామ అన్నాడీఎంకే అభ్యర్థిగా ధారాపురం నియోజకవర్గం నుంచి పోటీ చేసి విజయం సాధించారు. అనంతరం జరిగిన రాజకీయ పరిణామాల్లో ఆమె తన ఎమ్మెల్యే సీటుకు రాజీనామా చేసి విజయ్‌ జోసెఫ్ కు చెందిన టీవీకే పార్టీలో చేరారు. దీంతో ఈ నియోజకవర్గానికి ఉపఎన్నిక అనివార్యమైంది. త్వరలో జరగనున్న ఉపఎన్నికల్లో ఆమె టీవీకే అభ్యర్థిగా బరిలోకి దిగారు. ప్రస్తుతం ఎన్నికల ప్రచారం జరుగుతుంది.

ఎన్నికల ప్రచారంలో భాగంగా స్థాలిన్ మాట్లాడుతూ.. సత్యం కోసం నిలబడని ఆమెను సత్యభామ అని పిలవరని, డబ్బుల కోసం పార్టీ మారినందున సూట్ కేస్ భామ అని పిలుస్తారని కామెంట్స్ చేశారు. అంతటితో ఊరుకోకుండా ఆమెను ప్రజలు పల్టీ భామ అని కూడా పిలుస్తారని వ్యాఖ్యనించారు. సత్యభామ శరీరాకృతిని ప్రస్థావిస్తూ ఆమెకున్న ఆ రూపంతో అసలు అన్ని పల్టీలు ఎలా కొట్టగలిగిందో నాకు అర్థం కావడం లేదన్నారు.

స్థాలిన్ నోటి నుంచి వచ్చిన ఈ వ్యాఖ్యలు తమిళనాడు రాజకీయాల్లో వేడి రాజేసాయి. రాజకీయ పక్షాలతో పాటుగా మహిళా సంఘాలు మండిపడ్డాయి. మంత్రులు అరుణ్‌రాజ్, రాజ్ మోహన్, కీర్తన తదితరులు స్టాలిన్ వ్యాఖ్యలపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆమె దళిత మహిళ అనే కారణంతోనే స్టాలిన్ ఇంత దిగజారి విమర్శలు చేస్తున్నారని ధ్వజమెత్తారు. డీఎంకే పార్టీ గత ఓటముల నుండి ఏమాత్రం పాఠాలు నేర్చుకోలేదని బీజేపీ విమర్శించింది. స్థాలిన్ కూడా అంతగా దిగజారితే ఎలా అని తమిళ తంబీలు విచారం వ్యక్తం చేస్తున్నారు.