కొన్ని నెలల క్రితం మోహన్ లాల్ దృశ్యం 3 మీద చాలా విమర్శలొచ్చాయి. మలయాళం వెర్షన్ డబ్బులు తెచ్చి ఉండొచ్చేమో కానీ కంటెంట్ పరంగా అక్కడ కూడా ఆశించిన స్పందన రాలేదు. దీంతో దర్శకుడు జీతూ జోసెఫ్ ఈ సిరీస్ ఇక్కడితో ఆపేయడం మంచిదని విమర్శకులు అభిప్రాయపడ్డారు. కావాలని ఓపెన్ ఎండింగ్ పెట్టారని, టీవీ సీరియల్ తరహా నెరేషన్ తో విసుగు తెప్పించారని నెగటివ్ ఫీడ్ బ్యాక్ వచ్చింది. తాజాగా బాలీవుడ్ దృశ్యం 3 వచ్చింది. అడ్వాన్స్ బుకింగ్స్ నుంచే సంచలనాలు మొదలుపెట్టింది.
అందరికి ఉన్న డౌట్ ఏమిటంటే మల్లువుడ్ దృశ్యం 3కి ఇప్పుడీ బాలీవుడ్ మూడో దృశ్యానికి ఎంత వ్యత్యాసం ఉందనేది. ఆశ్చర్యకరం ఏమిటంటే కనీసం పది శాతం పోలిక కూడా లేకుండా అజయ్ దేవగన్ టీమ్ పూర్తిగా కొత్త కథను రాసుకుంది. టబు దంపతులు కేసుని తిరగదోడటం అనే పాయింట్ మినహాయించి మిగిలిన ట్విస్టులు, సస్పెన్సులు అన్నీ కొత్తగా, ఫ్రెష్ గా ఉన్నాయి. సోషల్ మీడియాలో ఎక్కువ శాతం పాజిటివ్ టాక్ రావడానికి ఇదే కారణమని చెప్పడంలో అనుమానం అక్కర్లేదు.
ముందు కథ చూద్దాం. కొడుకు శవం దొరకలేదని పగతో రగిలిపోతున్న మీరా దేశ్ ముఖ్ (టబు) జంట తమ కొడుకు కేసుని క్రైమ్ బ్రాంచ్ ఎస్పి రాజ్ వీర్ సింగ్ (జైదీప్ ఆహ్లావత్) తో తిరిగి ఓపెన్ చేయిస్తారు. వీళ్లకు సీనియర్ లాయర్ శెట్టి (ప్రకాష్ రాజ్) అండగా నిలుస్తాడు. పక్కా ఆధారాలతో కేసు కోర్టు విచారణకు వస్తుంది. సాక్ష్యాలన్నీ విజయ్ సాల్గోంకర్ (అజయ్ దేవగన్) కుటుంబానికి వ్యతిరేకంగా ఉంటాయి. ఈ ప్రతికూలతలు దాటుకుని ఆ నలుగురు ఎలా బయట పడ్డారనేది అసలు స్టోరీ.
దర్శకుడు అభిషేక్ పాఠక్ రాసుకున్న స్క్రీన్ ప్లే, కథనం నడిపించిన విధానం రెండున్నర గంటలు మరీ ఎక్కువ ల్యాగ్ లేకుండా సాఫీగా ఎంగేజ్ చేస్తాయి. రెండు మూడు ఎపిసోడ్లు కొంత ల్యాగ్ అయ్యాయి. క్లైమాక్స్ లో పెట్టిన ఒకటి రెండు ట్విస్టులు సిల్లీగా అనిపించినా ఓవరాల్ గా డీసెంట్ ఎక్స్ పీరియన్స్ ఇవ్వడంలో టీమ్ సక్సెస్ అయ్యింది. హీరో అజయ్ దేవగన్ కన్నా జైదీప్ ఆహ్లావత్ హైలైట్ అయ్యాడు. శ్రేయ, ప్రకాష్ రాజ్ పాత్రలు తమ పరిధి మేరకు తెరమీద బాగానే పండాయి.
Gulte Telugu Telugu Political and Movie News Updates
