దేశంలో కరోనా ప్రభావం కొనసాగుతుండటంతో థియేటర్లను వంద శాతం ఆక్యుపెన్సీతో నడపడానికి ససేమిరా అంటోంది కేంద్ర ప్రభుత్వం. 50 శాతం ఆక్యుపెన్సీకి మాత్రమే అనుమతులు ఇస్తూ ఇచ్చిన జీవోలో ఇప్పటిదాకా ఏ మార్పూ చేయలేదు. వివిధ పరిశ్రమల నుంచి వచ్చిన విజ్ఞప్తుల్ని కేంద్రం పట్టించుకోవట్లేదు. కానీ తమిళనాడు ప్రభుత్వం సొంతంగా తమ రాష్ట్రం వరకు 100 పర్సంట్ ఆక్యుపెన్సీతో థియేటర్లు నడపడానికి అనుమతులు ఇవ్వడం.. తర్వాత కేంద్రం ఇందుకు అంగీకరించకపోవడంతో ఆ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోక తప్పలేదు.
దీంతో దేశవ్యాప్తంగా ఇంకెక్కడా కూడా ఇప్పుడిప్పుడే 100 శాతం ఆక్యుపెన్సీతో థియేటర్లు నడవవనే అనుకున్నారంతా. కానీ అనూహ్యంగా పశ్చిమ బెంగాల్‌లో మాత్రం ముఖ్యమంత్రి మమతా బెనర్జీ సినీ పరిశ్రమకు ‘100 పర్సంట్ ఆక్యుపెన్సీ’ ఆఫర్ ఇచ్చేశారు.
కోల్‌కతాలో 26వ అంతర్జాతీయ ఫిలిం ఫెస్టివల్ ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథిగా హాజరైన మమత.. బెంగాల్‌లో 100 శాతం ఆక్యుపెన్సీతో థియేటర్లు నడుపుకోవడానికి అనుమతులిస్తున్నట్లు ప్రకటించారు. ఐతే కేంద్రం నిర్ణయానికి వ్యతిరేకంగా మమత ఈ ప్రకటన చేయడం చర్చనీయాంశం అవుతోంది. ఆమె పంతంతోనే ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.
మరి కొన్ని నెలల్లో బెంగాల్‌లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో మమత నేతృత్వంలోని తృణమూల్ కాంగ్రెస్‌కు, విపక్ష భారతీయ జనతా పార్టీ మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితి నెలకొంది. ఎన్నికల్లో ఈ రెండు పార్టీల మధ్య హోరాహోరీ పోరు తప్పేలా లేదు. మోడీ సర్కారు ఏ నిర్ణయం తీసుకున్నప్పటికీ వ్యతిరేకిస్తూ, విమర్శిస్తున్న మమత.. థియేటర్లను 50 శాతం ఆక్యుపెన్సీతో నడపాలన్న కేంద్రం నిర్ణయానికి వ్యతిరేకంగా నిర్ణయం తీసుకోవడం వెనుక ఉద్దేశం జనాలకు బాగానే అర్థమవుతోంది.
Gulte Telugu Telugu Political and Movie News Updates