ఎప్పుడూ జనాల్లో ఉండటం.. ఏదో ఒక కార్యక్రమం చేపట్టడం.. అధికార పక్షంలో వైఫల్యాల్ని ఎండగట్టడం ప్రధాన బాధ్యత. ఈ పని చేస్తే ఆటోమేటిగ్గా జనాల్లో ఆదరణ పెరుగుతుంది. ఎన్నికల్లో మంచి ఫలితాలు సాధించడానికి అవకాశముంటుంది. ఈ పని ఎన్నికల ముందు కాకుండా.. ముందు నుంచే చేయడం అత్యంత ముఖ్యమైన విషయం. జనసేన పార్టీకి ఈ విషయంలో ఆలస్యంగానే బోధపడిందని చెప్పాలి.
గత ఎన్నికలకు ఆరు నెలల ముందు మాత్రమే పవన్ జనాల్లోకి వచ్చాడు. అప్పుడు కూడా మధ్యలో బ్రేక్ తీసుకున్నాడు. ముందుతో పోలిస్తే తర్వాత మాటల్లో, కార్యక్రమాల్లో దూకుడు కూడా తగ్గించాడు. ఆ ప్రభావం ఎన్నికల్లో స్పష్టంగా కనిపించింది. ఐతే ఆ వైఫల్యంతో డీలా పడిపోకుండా.. 2024 ఎన్నికలను లక్ష్యంగా చేసుకుని జనసేన ఈ మధ్య చురుగ్గానే వ్యవహరిస్తోంది. పవన్ కళ్యాణ్ సాధ్యమైనంత ఎక్కువగా జనాల్లో ఉండే ప్రయత్నాలు చేస్తున్నారు. ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టే కార్యక్రమాలు చేపడుతున్నాడు.
తాజాగా తూర్పు గోదావరి జిల్లా ప్రజలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్న దివీస్ ఫార్మా ఫ్యాక్టరీకి వ్యతిరేకంగా జనసేన ఆందోళన బాట పట్టిన సంగతి తెలిసిందే. ఒకప్పుడు ప్రతిపక్షంలో ఉండగా వైకాపా ఈ ఫ్యాక్టరీని తీవ్రంగా వ్యతిరేకించింది. ఆందోళన కార్యక్రమాలు చేపట్టింది. కానీ అధికారంలోకి వచ్చాక జగన్ వైఖరి మారిపోయింది. ఆ ఫ్యాక్టరీకి అనుమతులు ఇచ్చేసింది. కానీ జనాలు మాత్రం ఫ్యాక్టరీకి వ్యతిరేకంగా పోరాటాన్ని ఆపలేదు. ఇంతకుముందు తాము అధికారంలో ఉండగానే ఈ ఫ్యాక్టరీకి అనుమతులు ఇచ్చాం కాబట్టి తెలుగుదేశం దీనిపై ఇప్పుడేమీ మాట్లాడలేని పరిస్థితి. ఈ అవకాశాన్ని జనసేన ఉపయోగించుకుంటోంది. బాధితులకు అండగా నిలిచేందుకు జనసేన ముందుకొచ్చింది.
శనివారం దివీస్‌కు వ్యతిరేకంగా అన్నవరం ప్రాంతంలో భారీ బహిరంగ సభ ఏర్పాటు చేశారు. జనసేన కార్యకర్తలతో పాటు బాధితులు పెద్ద సంఖ్యలోనే హాజరయ్యారు. ఈ సభలో ఊరికే ఊకదంపుడు ప్రసంగాలు దంచకుండా జనసేన నాయకులు తెలివిగా వ్యవహరించారు. ఇంతకుముందు ప్రతిపక్షంలో ఉండగా జగన్ దివీస్‌కు వ్యతిరేకంగా ఏం మాట్లాడారో స్టేజ్ మీద ప్రదర్శించారు. దీంతో జనాలకు ఇంకేమీ చెప్పాల్సిన అవసరం లేకపోయింది. విషయం సూటిగా జనాల్లోకి వెళ్లిపోయింది. ఈ వీడియోలు ప్రదర్శించినపుడు సభలో అద్భుతమైన స్పందన కనిపించింది. ఈ సందర్భంగా జనసేన అగ్రనేత నాదెండ్ల మనోహర్ కూడా సూటిగా సుత్తి లేకుండా ఆసక్తికర ప్రసంగం చేశారు.మరోవైపు అన్నవరంలో పవన్ చేసిన రోడ్ షో, బహిరంగ సభలో చేసిన ప్రసంగానికి కూడా మంచి స్పందనే వచ్చింది.