టీడీపీ ఎమ్మెల్యే బోండా ఉమ సొంత పార్టీపై కొద్ది రోజుల క్రితం చేసిన వ్యాఖ్యలు దుమారం రేపిన సంగతి తెలిసిందే. 2019-24 మధ్య పార్టీ కోసం తాను కష్టపడ్డా తనకు మంత్రి పదవి దక్కలేదని ఉమ బహిరంగంగా చేసిన వ్యాఖ్యలు దుమారం రేపాయి. ఇక, వైసీపీ నుంచి వచ్చిన పార్థసారథి, కొండపల్లి శ్రీనివాస్, సవితలకు మంత్రి పదవులిచ్చి తనకు ఇవ్వలేదని ఉమ చేసిన కామెంట్లు టీడీపీ అధిష్టానానికి కోపం తెప్పించాయి. ఆ వ్యాఖ్యల వేడి సద్దుమణగకముందే తాజాగా మరోసారి ఉమ చేసిన వ్యాఖ్యలు రాష్ట్ర రాజకీయాలలో హాట్ టాపిక్ గా మారాయి.
2019లో టీడీపీ ఓడిపోవడానికి కాపు ఉద్యమం కారణం అంటూ ఉమ చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశమయ్యాయి. ఈ క్రమంలోనే ఉమ వ్యాఖ్యలకు పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ కౌంటర్ ఇచ్చారు. తన వ్యక్తిగత వ్యాఖ్యలను ఉమ పార్టీకి అన్వయించడం సరికాదని వర్మ హితవు పలికారు. కాపులకు చంద్రబాబు చేసినంత మేలు ఎవరూ చేయలేదని వర్మ గుర్తు చేశారు.
2019లో ఒక్క ఛాన్స్ కావాలని జగన్ అడగడం వల్లే ప్రజలు వైసీపీని గెలిపించారని అభిప్రాయపడ్డారు. టీడీపీ నాయకులెవరైనా సరే ఈ తరహా కామెంట్లు చేసేముందు అది తమ వ్యక్తిగత అభిప్రాయమని, దాంతో పార్టీకి సంబంధం లేదని చెప్పడం మంచిదని సూచించారు.
2019లో టీడీపీ ఓటమికి అనేక కారణాలున్నాయని వర్మ అన్నారు. నేతలు వాస్తవాలు చెప్పాలని, అబద్ధాలు చెప్పడం సరికాదని ఉమకు వర్మ కౌంటర్ ఇచ్చారు. కాపులను బీసీలలో చేర్చాలని చెప్పింది చంద్రబాబేనని అన్నారు. కాపు కార్పొరేషన్ దరఖాస్తులను వైసీపీ రద్దు చేసిందని, కాపు భవనాల నిర్మాణాలను నిలిపివేసిందని గుర్తు చేశారు. కాపులకు తీరని అన్యాయం చేసిన వైసీపీకి ప్రజలు తగిన బుద్ధి చెప్పారని వర్మ అన్నారు. మరి, వర్మ కామెంట్లకు ఉమ కౌంటర్ ఏవిధంగా ఉండబోతోంది అన్నది ఆసక్తికరంగా మారింది.
Gulte Telugu Telugu Political and Movie News Updates
