ఏపీలో గత 2 మాసాల కిందటి వరకు తీవ్రస్థాయిలో చర్చనీయాంశం అయిన ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా, ఉండి నియోజకవర్గం పరిధిలోని ఆకివీడు రామాలయ నిర్మాణం వ్యవహారానికి సుప్రీంకోర్టు పచ్చ జెండా ఊపింది. నిర్విఘ్నంగా ఈ రామాలయాన్ని నిర్మించుకోవచ్చని పేర్కొంది. అదేసమయంలో జిల్లా కలెక్టర్ ఇచ్చిన నాన్ అబ్జెక్షన్ సర్టిఫికెట్‌ను కూడా సుప్రీంకోర్టు సమర్థించింది. దీంతో రామాలయానికి సర్వోన్నత న్యాయస్థానం పచ్చజెండా ఊపినట్టు అయింది.
ఆకివీడులోని పెదపాడు గ్రామంలో పురాతన కాలంలో రామాలయం ఉండేదని.. దీనిని పునర్నిర్మిస్తానని ప్రస్తుతం డిప్యూటీ స్పీకర్‌గా ఉన్న టీడీపీ నేత రఘురామకృష్ణరాజు ఉరఫ్ ట్రిపులార్ పేర్కొన్నారు. ఈ క్రమంలోనే ఏప్రిల్‌లో శ్రీరామ నవమి సందర్భంగా ఆయన ఈ ఆలయానికి వెళ్లి.. రాముడి విగ్రహానికి పూజలు చేశారు. అయితే.. అప్పట్లో పెను వివాదం చోటు చేసుకుంది. ఈ ఆలయం ఉన్న ప్రాంతంలో తాము గొంతేరమ్మ ఆలయాన్ని నిర్మించుకున్నామని ఎస్సీ సామాజిక వర్గం పెద్ద ఎత్తున తిరగబడింది.
ఇది.. రాజకీయంగా కూడా అనేక మలుపులు తిరిగింది. అనేక మందిపై పోలీసులు కేసులు కూడా పెట్టారు. ఇక, ఈ వ్యవహారం హైకోర్టు వరకు చేరింది. అయితే.. రామాలయం ఉన్న ప్రాంతం .. ప్రభుత్వానికే చెందుతుంది కాబట్టి.. అక్కడ రామాలయం నిర్మించేందుకు ఎలాంటి అభ్యంతరాలు అవసరం లేదని హైకోర్టు గతంలోనే తీర్పు చెప్పింది. అయితే.. పిటిషనర్లు.. ఈ తీర్పును సుప్రీంకోర్టులో సవాల్ చేశారు. దీనిపై తాజాగా జరిగిన విచారణలో సుప్రీంకోర్టు సైతం అనుమతి ఇచ్చింది.
ఇప్పటికే ఏర్పాట్లు..
మరోవైపు.. ఈ రామాలయాన్ని కోటి రూపాయల వ్యయంతో నిర్మించాలని భావించిన రఘురామ.. దీనికి క్రౌడ్ ఫండింగ్ చేశారు. దీనిద్వారా.. ఇప్పటికే కృష్ణ శిలలతో ఆలయ నిర్మాణాన్ని కూడా చేపట్టారు. అయితే..ఆందోళనలతో నిర్మాణ పనులు కొంత మందగించాయి. తాజాగా సుప్రీంకోర్టు కూడా దీనికి ఓకే చెప్పడంతో ఆర్ ఆర్ ఆర్ సంతోషం వ్యక్తం చేశారు. కాగా.. సుప్రీంకోర్టు పిటిషనర్లకు మరో సూచన చేసింది. ఏదైనా ఇతర అభ్యంతరాలు ఉంటే.. విడిగా పిటిషన్ వేసుకోవాలని సూచించింది.
Gulte Telugu Telugu Political and Movie News Updates
