ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా..? నిజం ఇదే..!

నీట్ పరీక్షల నిర్వహణలో జరిగినట్లు ఆరోపణలు వచ్చిన అవకతవకలు దేశవ్యాప్తంగా తీవ్ర చర్చకు దారితీశాయి. పరీక్షా విధానంలో పారదర్శకత, ప్రశ్నాపత్రాల లీకేజీ, విద్యార్థుల భవిష్యత్తుపై నెలకొన్న అనిశ్చితి వంటి అంశాలపై విద్యార్థులు, తల్లిదండ్రులు, విద్యావేత్తలు కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నారు. ఈ నేపథ్యంలో కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ ఢిల్లీలో పెద్దఎత్తున విద్యార్థి సంఘాలు, యువజన సంస్థలు నిరసన కార్యక్రమాలు నిర్వహిస్తున్నాయి.

అదే డిమాండ్‌తో ప్రముఖ విద్యావేత్త, పర్యావరణ ఉద్యమకారుడు సోనం వాంగ్‌చుక్ కూడా నిరవధిక నిరాహార దీక్ష చేపట్టి కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి పెంచుతున్నారు. విద్యా వ్యవస్థపై ప్రజల విశ్వాసాన్ని పునరుద్ధరించాలంటే బాధ్యులపై చర్యలు తీసుకోవాలని, నైతిక బాధ్యత వహిస్తూ మంత్రి పదవికి రాజీనామా చేయాలని ఆయన పిలుపునిస్తున్నారు.

ఈ పరిణామాల మధ్య కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తన పదవికి రాజీనామా చేసినట్లు పేర్కొంటూ ఒక లేఖ సోషల్ మీడియాలో వేగంగా వైరల్ అవుతోంది. ఆ లేఖలో నీట్ పరీక్షల నిర్వహణలో జరిగిన పరిణామాలకు నైతిక బాధ్యత వహిస్తూ తాను రాజీనామా చేస్తున్నట్లు, ప్రధాని నరేంద్ర మోదీకి లేఖ రాసినట్లు పేర్కొనబడింది. దీంతో విద్యార్థులు, నెటిజన్లలో గందరగోళం నెలకొంది. పైగా ఈ లేఖపై 21 వ తేదీ అని ఉండడం అనుమానాలకు తావిస్తుంది.

ఇదిలా ఉండగా, ఢిల్లీలోని జంతర్ మంతర్ మరోసారి విద్యార్థుల నిరసనలకు కేంద్రబిందువుగా మారింది. దేశంలోని వివిధ రాష్ట్రాల నుంచి వచ్చిన విద్యార్థులు, యువజన సంఘాలు, పౌరసంఘాల ప్రతినిధులు పెద్ద సంఖ్యలో అక్కడికి చేరుకుని నీట్ పరీక్షల నిర్వహణలో పారదర్శకత పాటించాలని, విద్యార్థుల భవిష్యత్తుతో చెలగాటం ఆడిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ నైతిక బాధ్యత వహిస్తూ రాజీనామా చేయాలని నినాదాలు చేస్తూ నిరసనలు కొనసాగిస్తున్నారు. దీంతో జంతర్ మంతర్ పరిసరాలు గత కొన్ని రోజులుగా ఆందోళనకారులతో కిక్కిరిసిపోతూ, దేశవ్యాప్తంగా విద్యా వ్యవస్థపై జరుగుతున్న చర్చలకు ప్రతీకగా నిలుస్తున్నాయి.