ఏపీ సీఎం చంద్రబాబు గుడ్ న్యూస్ చెప్పారు. ఈ ఏడాది దావోస్ లోని ప్రపంచ ఆర్ధిక సదస్సులో కుదుర్చుకున్న మరో ఒప్పందం సాకారం అయిందని తెలిపారు. దుబాయ్(యూఏఈ) ఫుడ్ క్లస్టర్ ద్వారా ఏపీలోని ఫుడ్ ప్రాసెసింగ్ రంగంలో ఎగుమతులు, వాణిజ్యం, పెట్టుబడులను పెట్టేలా ఏపీ ఈడీబీ-యూఏఈకి చెందిన ఫుడ్ క్లస్టర్ మధ్య అవగాహనా ఒప్పందం కుదిరిందని పేర్కొన్నారు. సీఎం చంద్రబాబు, యూఏఈ ఆర్ధిక, పర్యాటక విభాగం మంత్రి అబ్దుల్లా బిన్ తౌక్ అల్ మర్రీ సమక్షంలో ఎంఓయూ కుదుర్చుకున్నారు. ఏపీలో యూఏఈ ఫుడ్ క్లస్టర్ ద్వారా పెద్ద ఎత్తున ఉద్యాన ఉత్పత్తులను అంతర్జాతీయ మార్కెట్లకు ఎగుమతి చేసే అవకాశం లభించనుంది.
అదేసమయంలో విదేశీ వాణిజ్యం సహా యూఏఈకి చెందిన సంస్థలు పెట్టుబడులు పెట్టేలా ఈ ఒప్పందం దోహద పడనుంది. ఫుడ్ క్లస్టర్ ఏర్పాటుపై ఏపీ సచివాలయంలో సీఎం చంద్రబాబుతో యూఏఈ ప్రతినిధుల బృందం చర్చలు జరిపింది. ఈ ఏడాది జనవరిలో దావోస్ పర్యటనలో ఏపీలో ఫుడ్ క్లస్టర్ ఏర్పాటుకు సంబంధించి యూఏఈ సంసిద్ధత వ్యక్తం చేసింది. ఆహారశుద్ధి రంగంలో ఏపీలో వ్యాల్యూ చైన్ ఏర్పాటు చేయాలని యూఏఈ నిర్ణయించింది. దీనికిగాను ఏపీ ప్రభుత్వం- యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ మధ్య వ్యూహాత్మక భాగస్వామ్యం ఏర్పాటు చేస్తూ ఈ ఒప్పందాన్ని కుదుర్చుకున్నారు.
వీటికి లాభం..
రాష్ట్రంలో ఎక్కువగా పండే.. మామిడి, అరటి, కోకో లాంటి వివిధ ఉద్యాన ఉత్పత్తులకు సంబంధించి ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ల ఏర్పాటు, విలువ ఆధారిత ఉత్పత్తుల ఎగుమతులు, వాణిజ్యం లాంటి అంశాల్లో ఏపీకి మేలు జరగనుందని సీఎం చంద్రబాబు తెలిపారు. ఈ ఒప్పందంలో తొలి అడుగుగా యూఏఈకి చెందిన ఫ్లోర్ మాస్టర్స్ ఇంటర్నేషనల్ సంస్థ ఏపీలోని చిత్తూరులో రూ.100 కోట్లను పెట్టుబడిగా పెట్టేందుకు ముందుకు వచ్చింది. చిత్తూరు జిల్లా, గంగాధర నెల్లూరులో ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ ఏర్పాటు చేయనున్న ఈ సంస్థ ప్రపంచ శ్రేణి ఉత్పత్తులను తయారు చేయనుంది. ఏపీలో ఏర్పాటు చేయనున్న ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ నుంచి అంతర్జాతీయ మార్కెట్లకు ఉత్పత్తులను ఎగుమతి చేయనునున్నారు.
ఆరు మాసాల్లోనే అడుగులు వేశాం!
దావోస్ లో జరిగిన ప్రపంచ ఆర్ధిక సదస్సులో ఏపీలో పెట్టుబడులు పెట్టేందుకు ఆసక్తి కనపరిచిన యూఏఈ ఆరు నెలల్లోగా వాటిని సాకారం చేసే దిశగా ముందుకు వచ్చిందని సీఎం చంద్రబాబు అన్నారు. యూఏఈ ఫుడ్ క్లస్టర్ ద్వారా ఫుడ్ ప్రాసెసింగ్ రంగంలో ఎగుమతులు, వాణిజ్యం, పెట్టుబడులకు ఏపీ వేదిక కావటం సంతోషదాయకమని సీఎం వ్యాఖ్యానించారు. రాష్ట్ర స్థూల ఆదాయంలో 30 శాతం మేర ఉద్యాన, వ్యవసాయ ఉత్పత్తుల ద్వారా వస్తోందని చెప్పారు. 200కు పైగా ఉద్యాన క్లస్టర్లతో ఆక్వా మిర్చి, పామాయిల్, కోకో, కాఫీ తదితర పంటల్లో ఏపీ ఎగుమతులు చేస్తోందని సీఎం వివరించారు.
Gulte Telugu Telugu Political and Movie News Updates
