టీడీపీ ని నిలబెట్టింది కార్యకర్తలు.. వారి అండతోనే పార్టీ విజయం దక్కించుకుంటోంది- అని పార్టీ అధినేత చంద్రబాబు, పార్టీ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ నారా లోకేష్ పదే పదే చెబుతున్నారు. ఓకే.. ఇంత వరకు బాగానే ఉంది. కానీ, క్షేత్రస్థాయిలో కీలక నాయకుల సంగతి ఏంటి ? వారి దూకుడుకు కళ్లెం వేయకపోతే.. వచ్చే నష్టం ఏంటి? అనే విషయాలను ఇద్దరూ లైట్ తీసుకుంటున్నారా ? చూసీ చూడనట్టు వ్యవహరిస్తున్నారా ? అంటే.. అవుననే సమాధానమే వినిపిస్తోంది.
తాజాగా కేవలం నాలుగు రోజుల వ్యవధిలో జరిగిన రెండు ఘటనలు.. పార్టీ నేతల దూకుడును ప్రస్ఫుటంగా చాటి చెబుతున్నాయి. గుంటూరు నగరంలో జరిగిన మహిళ ఘటన వ్యవహారం దుమారం రేపిన నేపథ్యంలో హుటాహు టిన చర్యలు తీసుకున్నామని సీఎం చంద్రబాబు ప్రకటించారు. సదరు నేత మూర్తిపై సస్పెన్షన్ వేటు వేశామని కూడా ఆయన చెప్పారు. కానీ, ఆవెంటనే కడప జిల్లా బద్వేల్‌లో తాజాగా జరిగిన మరో ఘటనలోనూ ఇదే పర్వం కొనసాగింది. కారణాలు వేరైనా.. మహిళలపైనే నాయకులు దూకుడుగా వ్యవహరించారు.
బద్వేల్ ఘటనలో వృద్ధురాలి జాకెట్ చిరిగిపోవడం..దీనికి టీడీపీ విద్యార్థి విభాగం జిల్లా అధ్యక్షుడి పాత్ర ఉందని బాధితురాలు ఆరోపించడం సంచలనంగా మారింది. వీటిని ప్రస్తుతానికి లైట్ తీసుకున్నా.. క్షేత్రస్థాయిలో ప్రచారం మాత్రం జోరుగా సాగుతోంది. ఇలాంటి ఘటనలే 2019లో పార్టీని డైల్యూట్ చేశాయన్న సంగతి ఇప్పుడు ప్రస్తావనార్హం. పార్టీలో అధినేత ఎంత బలంగా ఉన్నా.. క్షేత్రస్థాయిలో నాయకులు వీక్‌గా మారితే.. అదిమొత్తం పార్టీపైనే ప్రభావం చూపించడం టీడీపీకి అనుభవమే. అయినా.. దీనిని సరిచేయడం లేదన్న వాదన వినిపిస్తోంది.
కేవలం సస్పెన్షన్లతోనే సరిపుచ్చుతున్న వైనంపై పార్టీలోనే అంతర్గతంగా విస్మయం వ్యక్తమవుతోంది. పార్టీ పరంగా అధినేత బాగానే ఉన్నారు. కీలక నాయకులు కూడా బానే పనిచేస్తున్నారు. కానీ, ఓటు బ్యాంకుపై ప్రభావం చూపించే క్షేత్రస్థాయి అంశాలపై చూసీ చూడనట్టు.. వ్యవహరిస్తున్న తీరుతో పార్టీపైనే బ్యాడ్ నేమ్ వచ్చే అవకాశం మెండుగా కనిపిస్తోంది. ఇలాంటి ఘటనలపై కఠిన చర్యలు తీసుకుని.. బాధితుల పక్షానే పార్టీ నిలబడాల్సిన అవసరం ఉందని సీనియర్లు చెబుతున్నారు. అయితే.. ఈదిశగా చర్యలు తీసుకోవడంలో ఎక్కడో జాప్యం జరుగుతోంది. ఇది మున్ముందు ప్రమాదకర పరిస్థితిని తీసుకువచ్చే అవకాశం ఉందని అంటున్నారు.
Gulte Telugu Telugu Political and Movie News Updates