దేశరాజధాని ఢిల్లీలో సోమవారం చోటు చేసుకున్న పరిణామాలపై సోషల్ మీడియా వేదికగా అనేక వ్యాఖ్యలు వెల్లువెత్తుతున్నాయి. అందరి టార్గెట్ ఒక్కటే.. ప్రధాని మోడీ!. ఆయనను లక్ష్యంగా చేసుకుని మేధావుల నుంచి తటస్థ రాజకీయ నాయకుల వరకు వేలాది మంది పోస్టులు పెట్టారు. సమస్యలు రావడం సహజం. కానీ, బల ప్రయోగం సరికాదు. చర్చల ద్వారానే పరిష్కరించుకోవాలి అంటూ.. ప్రపంచ దేశాలకు పదే పదే సూచించే ప్రధాని ఇప్పుడు కాక్రోచ్ జనతా పార్టీ చేపట్టిన నిరసనపై ఎందుకు మౌనంగా ఉంటున్నారు? మీరు చెప్పే నీతులు మీకు వర్తించవా? అని అనేక మంది నిలదీశారు.
ఢిల్లీ రణరంగం
నీట్ ప్రవేశ పరీక్షలో జరిగిన అవకతవకలకు బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలన్న డిమాండ్‌తో కాక్రోచ్ జనతా పార్టీ చేపట్టిన నిరసన సోమవారం రణరంగంగా మారింది. పార్టీ కార్యకర్తలను పోలీసులు ఎక్కడిక క్కడ చితకబాదారు. కర్రలు, లాఠీలతో తీవ్రంగా కొట్టారు. ఈ దాడుల్లో విద్యార్థులు పదుల సంఖ్యలో గాయపడ్డారు. అదే సమయంలో భాష్పవాయు గోళాలను విసరడంతో విద్యార్థులు, సీజేపీ కార్యకర్తలు తీవ్రంగా గాయపడ్డారు. ఆయా ఘటనలకు సంబంధించి ప్రసారాలు దాదాపు అన్ని టీవీల్లోనూ వచ్చాయి. వీటిపైనే మేధావులు తీవ్రంగా స్పందించారు. కుండపోత వర్షంలోనూ పట్టువదల కుండా నిరసన వ్యక్తం చేస్తున్న విద్యార్థులపై లాఠీలతో విరుచుకుపడడం ఏంటని ప్రశ్నించారు.
ప్రపంచానికి సుద్దులు చెప్పే మోడీ.. ఇప్పుడు అదే విద్యార్థులు సీజేపీ కార్యకర్తలతో ఎందుకు చర్చలు జరపరని కొందరు వ్యాఖ్యానించారు. నీతులు చెప్పడమే విశ్వగురు పని అని ఎక్కువ మంది కామెంట్లు చేశారు. ఇదిలావుంటే.. నిరాహార దీక్షకు దిగిన సీజేపీ చీఫ్ అభిజిత్ దీప్కేను ఢిల్లీ పోలీసులు అరెస్టు చేశారు. దీంతో నిరసన సర్దుమణుగుతుందని భావించారు. కానీ, దీనికి భిన్నంగా విద్యార్థులు గంట గంటకు వెల్లువలా ఢిల్లీకి తరలి వచ్చారు. ఏ క్షణం ఏం జరుగుతుందో అన్న ఉత్కంఠ నెలకొంది. మొత్తానికి సీజేపీపై బల ప్రయోగం చేయడాన్ని దేశవ్యాప్తంగా అనేక మంది మేధావులు ముక్తకంఠంతో ఖండించడం గమనార్హం.
తదుపరి కార్యాచరణ!
కాక్రోచ్ జనతా పార్టీ ప్రస్తుత నిరసనకు తాత్కాలిక విరామం ప్రకటిస్తున్నట్టు వార్తలు వస్తున్నాయి. ప్రభుత్వానికి కొంత సమయం కేటాయించి.. తర్వాత తదుపరి కార్యాచరణకు సిద్ధం కావాలని సీజేపీ నిర్ణయించింది. మరోవైపు.. కేంద్ర ప్రభుత్వం సైతం రంగంలోకి దిగి.. అమిషాను ముందు పెట్టి ప్రస్తుత నిరసనలను సర్దుమణిగేలా చర్చలు చేపట్టింది. ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న సోనమ్ వాంగ్ చుక్‌తో చర్చలకు సిద్ధమేనని కేంద్ర మంత్రి జేపీ నడ్డా ప్రకటించినట్టు ఏఎన్ ఐ వార్తా సంస్థ ప్రకటించింది. అయితే.. అధికారికంగా ఈ విషయంపై ఎలాంటి ప్రకటనా రాకపోవడం గమనార్హం.
Gulte Telugu Telugu Political and Movie News Updates