చేతికి క‌ట్టుతోనే డ్యూటీలో చేరిపోయిన డిప్యూటీ సీఎం!

చిన్న‌పాటి జ్వ‌రం వ‌స్తేనే సెల‌వు పెట్టి రెస్టు తీసుకునే రోజుల్లో కుడి చేతి కీల‌క భాగానికి(రొటేట‌రీ క‌ఫ్‌) ఆప‌రేష‌న్ చేయించుకున్న ఏపీ డిప్యూటీ సీఎం, జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ల్యాణ్ మాత్రం ప‌ట్టుమ‌ని నాలుగు రోజులు కూడా ఇంటి ప‌ట్టున ఉండ‌లేక పోయారు. ప్ర‌జ‌ల కోసం.. ప్ర‌జ‌ల చేత అన్న‌ట్టుగా ఆయ‌న చేతికి క‌ట్టుతోనే డ్యూటీలో చేరిపోయిన చిరుద్యోగి మాదిరిగా ఏపీకి వ‌చ్చేశారు. శస్త్రచికిత్స అనంతరం తొలిసారిగా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సోమవారం ఏపీకి వచ్చారు.

గన్నవరం అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకున్న ఆయనకు పలువురు ఉన్నతాధికారులు, పార్టీ నేతలు ఘన స్వాగతం పలికారు. ఎయిర్ పోర్టులో అధికారులు పూలబొకేలు అందించి డిప్యూటీ సీఎంను సాదరంగా ఆహ్వానించారు. శస్త్రచికిత్స తర్వాత రాష్ట్రానికి వ‌చ్చిన‌ పవన్ కళ్యాణ్ ను చూసేందుకు పార్టీ కార్యకర్తలు పెద్ద సంఖ్యలో తరలి వచ్చారు. అక్కడి నుంచి రోడ్డు మార్గం ద్వారా తాడేపల్లిలోని పార్టీ కార్యాలయానికి బయలుదేరి వెళ్లారు. మార్గమధ్యంలో పలుచోట్ల కార్యకర్తలు, అభిమానులు నినాదాలతో డిప్యూటీ సీఎంకు ఘన స్వాగతం పలికారు.

ఎందుకీ తొంద‌ర‌?

కుడి భుజానికి ఆప‌రేష‌న్ చేయించుకున్న ప‌వ‌న్ క‌ల్యాణ్‌.. ఇంత వేగంగా విధుల్లో చేర‌డానికి కార‌ణం ఏంట‌నే సందేహం స‌హ‌జం. ప్ర‌ధానంగా రెండు కార‌ణాలు ఉన్నాయ‌ని పార్టీ వ‌ర్గాలు చెబుతున్నాయి. త్వ‌ర‌లోనే స్థానిక సంస్థ‌ల ఎన్నిక‌లు జ‌ర‌గ‌నున్నాయి. ఈ నేప‌థ్యంలో కూట‌మి పార్టీల త‌ర‌ఫున సీట్ల ఎంపిక‌పై చ‌ర్చించాల్సి ఉంది. మ‌రీ ముఖ్యంగా ఆశావ‌హులు ఎక్కువ‌గా ఉన్న నేప‌థ్యంలో పార్టీలో ప్ర‌స్తుతం ఈ వ్య‌వ‌హారంపైనే తీవ్ర‌స్థాయిలో చ‌ర్చ సాగుతోంది. ఈ నేప‌థ్యంలో పార్టీ నేత‌ల‌తోను.. మ‌రోవైపు సీఎం చంద్ర‌బాబుతోనూ చ‌ర్చించేందుకు ప‌వ‌న్ ప్రాధాన్యం ఇస్తున్నారు.

ఇక‌, ప్ర‌ధాన మంత్రి న‌రేంద్ర మోడీ ఆగ‌స్టు 1న ఏపీకి వ‌స్తున్నారు. విజ‌య‌న‌గ‌రం జిల్లా భోగాపురంలో నిర్మించిన అల్లూరి సీతారామ‌రాజు అంత‌ర్జాతీయ విమానాశ్ర‌యాన్ని ఆయ‌న ప్రారంభించ‌నున్నారు. ఈ నేప‌థ్యంలో భోగాపురంలోని పంచాయతీలను ఇటీవ‌ల అభివృద్ధి చేసిన నేప‌థ్యంలో ఆయా కార్య‌క్ర‌మాల విశేషాల‌ను కూడా ప్ర‌ధానికి వివ‌రించాల‌ని పంచాయ‌తీ రాజ్ శాఖ అధికారులు నిర్ణ‌యించారు. ఈ అంశాల‌పై కూడా ప‌వ‌న్ చ‌ర్చించ‌నున్నారు. ఇలా.. వ‌రుస కార్య‌క్ర‌మాల నేప‌థ్యంలోనే చేతికి క‌ట్టు ఉన్న‌ప్ప‌టికీ.. ప‌వ‌న్ క‌ల్యాణ్ విధుల‌కు హాజ‌రు కావ‌డం గ‌మ‌నార్హం.