త‌మ్మినేనిపై భూ క‌బ్జా కేసు… వైసీపీకి భారీ ఎఫెక్ట్‌?

వైసీపీ సీనియ‌ర్ నాయ‌కుడు, ఏపీ అసెంబ్లీ మాజీ స్పీక‌ర్ త‌మ్మినేని సీతారాం, ఆయ‌న స‌తీమ‌ణి స‌హా కుటుంబ స‌భ్యుల‌పై శ్రీకాకుళం జిల్లా రూర‌ల్ పోలీసులు కేసు న‌మోదు చేశారు. సుమారు నాలుగు కోట్ల రూపాయ‌ల విలువైన భూమిని క‌బ్జా చేసేందుకు వీరు ప్ర‌య‌త్నించార‌ని పోలీసులు తెలిపారు. అంతేకాదు.. మ‌ధ్య‌వ‌ర్తుల ద్వారా.. ఈ వ్య‌వ‌హారాన్ని ఇప్పటికే పీక్ రేంజ్‌కు తీసుకువెళ్లార‌ని పేర్కొన్నారు. దీనిపై అందిన స‌మాచారంతో కేసు న‌మోదు చేశారు. అదే స‌మ‌యంలో కేసులో మ‌ధ్య‌వ‌ర్తులుగా వ్య‌వ‌హ‌రించిన ఎనిమిది మందిని అరెస్టు చేశారు.

త‌న‌యుడి కోసం..

త‌మ్మినేని సీతారాం దంప‌తులు త‌మ కుమారుడు చిరంజీవి నాగ్ పేరుతో శ్రీకాకుళం జిల్లా ఆముదాల‌వ‌ల‌సలోని బ‌ల‌గ ప్రాంతం లో ఓ భూమిని రిజిస్ట్రేష‌న్ చేయించారు. ఈ భూమిని ఒడిశా ప్రాంతానికి చెందిన అడ‌బాల ర‌జ‌నీ నుంచి కొనుగోలు చేసిన‌ట్టు ప‌త్రాల్లో పేర్కొన్నారు. కొనుగోలు ప్రక్రియ‌తో పాటు రిజిస్ట్రేష‌న్ కూడా పూర్త‌య్యాక‌.. స‌ద‌రు స్థ‌లానికి చుట్టూ ప్ర‌హ‌రీ నిర్మించే ప్ర‌య‌త్నం చేశారు. మొత్తంగా నిర్మాణం ప్రారంభం కానున్న నేప‌థ్యంలో ఈ క‌థ యూట‌ర్న్ తీసుకుంది. ఈ స్థ‌లం వాస్త‌వ య‌జ‌మానులు రంగంలోకి వ‌చ్చారు.

పేర్లు మార్చి !

స‌ద‌రు భూమి వాస్త‌వ య‌జ‌మాని అంధ‌వ‌ర‌పు గోవింద‌రాజులు. అయితే.. ఆయ‌నకు తెలియ‌కుండానే కొంద‌రు మ‌ధ్య‌వ‌ర్తుల ద్వారా ఆయ‌న చ‌నిపోయిన‌ట్టు డెత్ స‌ర్టిఫికెట్ పుట్టించారు. అనంత‌రం.. స‌ద‌రు భూమికి వార‌సురాలిగా ఒడిశాకు చెందిన ర‌జ‌నీని తెర‌మీదికి తెచ్చారు. కానీ, వాస్త‌వానికి గోవింద‌రాజులు కుమార్తె పేరు కూడా ర‌జ‌నీనే కావ‌డంతో అధికారులు గుర్తించ‌లేకపోయారు. అనంత‌రం.. అడబాల ర‌జ‌నీ నుంచి ఈ భూమిని కొనుగోలు చేస్తున్న‌ట్టుగా ప‌త్రాలు రూపొందించారు. అంటే.. గోవింద‌రాజులు కుమార్తెనే మార్చేసి.. అధికారుల‌ను ఏమార్చార‌న్న‌మాట‌.

ఇదంతా వైసీపీ హ‌యాంలోనే జ‌రిగిన‌ట్టు తెలుస్తోంది. అనంత‌రం.. ఇటీవ‌ల కాలంలో ఈ స్థ‌లంలో ప్ర‌హ‌రీ నిర్మాణానికి అనంత‌రం.. ఇంటి నిర్మాణానికి ప్ర‌య‌త్నాలు ముమ్మ‌రం కావ‌డంతో వాస్త‌వ ల‌బ్ధిదారు అయిన అంధ‌వ‌ర‌పు ర‌జ‌నీ ఈ మోసాన్ని గుర్తించారు. ఆవెంట‌నే అధికారుల‌కు స‌మాచారం ఇచ్చారు. నకిలీ పత్రాలు, తప్పుడు వారసత్వం సృష్టించడం, తప్పుడు రిజిష్ట్రేషన్‌ తదితర అంశాలపై ఆమె ఫిర్యాదు చేయ‌డంతో రివెన్యూ అధికారులు వీటిపై విచార‌ణ చేసి.. పోలీసుల‌కు స‌మాచారం ఇచ్చారు. అనంత‌రం ఈ వ్య‌వ‌హారంతో సంబంధం ఉన్న 13 మందిపై పోలీసులు కేసులు పెట్టారు. వీరిలో త‌మ్మినేని కుటుంబం కీల‌క నిందితులుగా ఉన్నార‌ని పోలీసులు తెలిపారు.