సీనియర్ నటుడు, రాజకీయ నాయకుడు కృష్ణం రాజుకు ఓ ఉన్నత పదవిని ఇవ్వాలని భారతీయ జనతా పార్టీ అధిష్ఠానం నిర్ణయించినట్లు తెలుస్తోంది. ఆయన తమిళనాడు గవర్నర్‌గా నియమితులు కాబోతున్నారట. అతి త్వరలోనే ఈ మేరకు ఉత్తర్వులు రానున్నాయట. కృష్ణంరాజుకు ఈ మేరకు బీజేపీ అధిష్ఠానం నుంచి సమాచారం కూడా వచ్చినట్లు తెలుస్తోంది. మూడేళ్లుగా తమిళనాడు గవర్నర్‌గా ఉన్న భన్వరిలాల్ పురోహిత్ స్థానంలో ఆయన తమిళనాడు గవర్నర్‌గా బాధ్యతలు స్వీకరించనున్నారట. భన్వరిలాల్ కంటే ముందు తమిళనాడు గవర్నర్‌గా ఉన్నది తెలుగువాడే అయిన సీనియర్ నేత రోశయ్య కావడం విశేషం. ప్రస్తుతం తెలుగు రాష్ట్రమైన తెలంగాణలో తమిళురాలైన తమిళిసై గవర్నర్‌గా కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ఇలా పొరుగు రాష్ట్రాల్లో గవర్నర్లుగా ఇటు అటు వారు ఉండబోతుండటం విశేషమే.
ఎన్టీఆర్, కృష్ణల బాటలోనే సినిమాల్లో మంచి ఇమేజ్, సీనియారిటీ సంపాదించాక రాజకీయాల వైపు చూసిన నటుడు కృష్ణంరాజు. ముందుగా ఆయన కాంగ్రెస్ పార్టీలో చేరారు. 1991లో నరసాపురం నుంచి ఎంపీగా పోటీ చేసి ఓడిపోయారు. ఆ తర్వాత బీజేపీలో చేరి 1998లో ఆ పార్టీ తరఫున ఎంపీగా పోటీ చేసి భారీ మెజారిటీతో గెలిచారు. అప్పట్నుంచి ఆయన భాజపాలోనే కొనసాగుతున్నారు. వాజ్ పేయి ప్రభుత్వంలో ఆయన వివిధ శాఖలకు కేంద్ర మంత్రిగానూ పని చేయడం విశేషం. కొన్నేళ్లుగా కృష్ణంరాజు క్రియాశీల రాజకీయాల్లో లేనప్పటికీ పార్టీ మద్దతుదారుగా కొనసాగుతున్నారు. ఏపీ నుంచి సుదీర్ఘ కాలం పార్టీలో ఉండటం, తన చరిష్మాతో పార్టీకి ఉపయోగపడటం.. ఇవన్నీ దృష్టిలో ఉంచుకుని కృష్ణం రాజుకు గవర్నర్ పదవిని ఇవ్వబోతున్నట్లు తెలుస్తోంది. ఇది రెబల్ స్టార్ అభిమానులకు అమితానందాన్ని ఇచ్చే విషయమే.