వంద కోట్ల ఆస్తి… పీకే సంచలన అఫిడవిట్!

రాజకీయ వ్యూహకర్త నుంచి ప్రత్యక్ష రాజకీయాల్లోకి దిగిన ప్రశాంత్ కిషోర్ (పీకే) ఆస్తుల వివరాలు ఇప్పుడు పాలిటిక్స్ లో హాట్ టాపిక్ గా మారాయి. జన్ సురాజ్ పార్టీ స్థాపించి బీహార్ లోని బంకిపూర్ అసెంబ్లీ ఉప ఎన్నికల బరిలో నిలిచిన ఆయన సోమవారం తన నామినేషన్ వేశారు. ఈ సందర్భంగా ఎన్నికల సంఘానికి సమర్పించిన అఫిడవిట్ లో తన ఆస్తుల చిట్టా విప్పారు.

పీకే ప్రకటించిన లెక్కల ప్రకారం ఆయన ఆస్తుల విలువ వంద కోట్లు దాటింది. కచ్చితంగా చెప్పాలంటే ఆయనకు 105 కోట్ల రూపాయల ఆస్తులు, 5.78 కోట్ల మేర అప్పులు ఉన్నాయి. ఇందులో చరాస్తుల విలువే 22.20 కోట్లుగా చూపించారు. రాజకీయ సలహాదారుడిగా, కన్సల్టెంట్ గా, బ్యాంక్ డిపాజిట్ల ద్వారా వచ్చే వడ్డీలే తన ప్రధాన ఆదాయ వనరులని ఆయన అఫిడవిట్ లో స్పష్టం చేశారు.

ఇక్కడ మరో ఆసక్తికరమైన విషయం ఏంటంటే.. పీకే కంటే ఆయన భార్య జాహ్నవి దాస్ పేరు మీదే ఎక్కువ ఆస్తులు ఉన్నాయి. ఆమె పేరిట ఏకంగా 112 కోట్ల ఆస్తులు ఉండగా, అందులో 99.52 కోట్లు చరాస్తులే కావడం విశేషం. ఆమెకు కేవలం 55.38 లక్షల అప్పులు మాత్రమే ఉన్నాయి. న్యూఢిల్లీలోని అపోలో ఇంద్రప్రస్థ హాస్పిటల్ లో డాక్టర్ గా, సీనియర్ అడ్వైజర్ గా సేవలు అందిస్తున్న ఆమెకు.. కన్సల్టెన్సీ, అద్దెల ద్వారా భారీగానే ఆదాయం వస్తోంది.

ఇక వీరి కుమారుడు దైబిక్ భరద్వాజ్ పేరు మీద కూడా 7.19 లక్షల విలువైన చరాస్తులు ఉన్నట్లు ఎన్నికల పత్రాల్లో పేర్కొన్నారు. ఒక కార్పొరేట్ స్థాయి ఆర్థిక బలం ఉన్నప్పటికీ, ప్రశాంత్ కిషోర్ పై ఏకంగా 8 కేసులు పెండింగ్ లో ఉండటం గమనార్హం. ప్రభుత్వ అధికారుల విధులకు ఆటంకం కలిగించడం, అల్లర్లు, అక్రమంగా గుమికూడటం లాంటి ఆరోపణలతో ఈ కేసులు నమోదయ్యాయి.

ఇన్నాళ్లూ తెర వెనుక ఉండి ఎంతోమంది నాయకులను అధికార పీఠం ఎక్కించిన పీకే, ఇప్పుడు స్వయంగా ఓట్లు అడుగుతూ ప్రజల ముందుకు వస్తున్నారు. పల్లెల్లో పాదయాత్రలు చేస్తూ సామాన్యుడిలా కనిపిస్తున్న ఆయనకు ఇంత భారీ ఆర్థిక సామర్థ్యం ఉందని అఫిడవిట్ ద్వారా బయటపడింది. ప్రత్యర్థి పార్టీపై తీవ్ర విమర్శలు చేస్తూ బరిలోకి దిగిన ఈ వంద కోట్ల వ్యూహకర్తను బంకిపూర్ ఓటర్లు ఎంతవరకు ఆదరిస్తారో వేచి చూడాలి.