జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కు శనివారం శస్త్ర చికిత్స జరిగింది. ముంబైలో జరిగిన ఈ శస్త్ర చికిత్సకు ఏకంగా 3.5 గంటల సమయం పట్టింది. ఏళ్ల క్రితం అయిన గాయాలకు సంబంధించి పవన్ చాలా కాలంగా విపరీతమైన నొప్పితో బాధపడుతున్న సంగతి తెలిసిందే. 2018లో రెండు భుజాలకు గాయాలు కాగా… వాటికి సంబంధించిన చికిత్సను ఎప్పటికప్పుడు వాయిదా వేస్తూ వచ్చారు. అయితే వాటిని మరింత కాలం వాయిదా వేయడం ప్రమాదమన్న వైద్యుల సూచనలతో తాజాగా ఆపరేషన్ చేయించుకున్నారు.
ఇటీవలే ముక్కుకు చేయించుకున్న శస్త్ర చికిత్స సందర్భంగా భుజాలకు ఉన్న గాయాలను ముంబై వైద్యులు గుర్తించారు. విపరీతమైన నొప్పి ఉన్న ఆ గాయాలను ఇంతకాలం ఎలా భరించారంటూ వైద్యులు పవన్ ను ప్రశ్నించిన సంగతి తెలిసిందే. రెండు భుజాలకు అయిన గాయాలకు తక్షణమే చికిత్స చేయించుకోవాలని, లేని పక్షంలో ప్రమాదమేనని వైద్యులు సూచించారు. అయితే అప్పటికే డిప్యూటీ సీఎం హోదాలో ఖరారైన పలు కార్యక్రమాలను వాయిదా వేయడం ఇష్టంలేని పవన్… వైద్యులు చెప్పినా… ఆపరేషన్ ను వాయిదా వేశారు. తాజాగా శుక్రవారం ముంబై వెళ్లి… ఆపరేషన్ చేయించుకున్నారు.
శనివారం జరిగిన ఆపరేషన్ లో కుడి భుజానికి మాత్రమే శస్త్ర చికిత్స జరిగింది. రొటేటర్ కఫ్ గాయానికి జరిగిన ఈ చికీత్సకు ఏకంగా 3.5 గంటల సమయం పట్టిందని వైద్యులు తెలిపారు. శనివారం నాటి ఆపరేషన్ లో కేవలం కుడి భుజానికి మాత్రమే చికిత్స జరగగా… ఎడమ భుజానికి రెండు నెలల్లోగా ఆపరేషన్ చేయాల్సి ఉంది. రెండు భుజాలకూ ఒకే సారి ఆపరేషన్ చేస్తే ఆ నొప్పి తీవ్రంగా ఉంటుందని, ఆ నొప్పిని భరించడం సాధ్యం కాదన్న భావనతోనే వైద్యులు ప్రస్తుతానికి ఒక్క భుజానికి మాత్రమే ఆపరేషన్ చేశారు. అంటే… రెండు నెలల్లోగా మరోమారు ముంబై వెళ్లి ఎడమ భుజానికి ఆపరేషన్ చేయించుకోవాల్సి ఉంటుంది.
పవన్ కు ఆపరేషన్ విజయవంతం అయిన తీరుపై తెలుగు ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. పవన్ కు ఆపరేషన్ సక్సెస్ అయిన విషయాన్ని తెలుసుకున్న టీడీపీ అదినేత, ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు స్పందించారు. పవన్ త్వరగా కోలుకోవాలని కోరుతూ ఆయన ఓ సందేశాన్ని విడుదల చేశారు. తెలుగు రాష్ట్రాలకు చెందిన పలువురు రాజకీయ నేతలు, పలు రంగాలకు చెందిన ప్రముఖులు కూడా పవన్ త్వరగా కోలుకోవాలని ఆశిస్తూ సందేశాలు విడుదల చేస్తున్నారు. ఆపరేషన్ విజయవంతం కావడం పట్ల ప్రముఖ సినీ నిర్మాత బండ్ల గణేశ్ హర్షం ప్రకటించారు.
Gulte Telugu Telugu Political and Movie News Updates