తెలంగాణ రక్షణ సమితి(టీఆర్ఎస్) అధ్యక్షురాలు కవిత సంచలన డిమాండ్ చేశారు. ప్రధాన ప్రతిపక్షం బీఆర్ ఎస్ ఖాతాలో ప్రస్తుతం 1400 కోట్ల రూపాయలకు పైగానే నిల్వలు ఉన్నాయని.. ఈ సొమ్మును తెలంగాణ రాష్ట్రం కోసం రక్తాన్ని ధారపోసి ప్రాణాలు త్యాగం చేసిన అమరవీరుల కుటుంబాలకు తక్షణమే పంపిణీ చేయాలని డిమాండ్ చేశారు. ఈ సొమ్మంతా బీఆర్ ఎస్ హయాంలో దోచుకున్నదేనని ఆమె మరో వ్యాఖ్య చేయడం గమనార్హం.
పదేళ్లు అధికారంలో ఉన్నప్పుడు.. `క్విడ్ ప్రోకో`(నాకది-నీకిది) విధానంలో ఆంధ్రా కాంట్రాక్టర్ల ద్వారా బీఆర్ఎస్ పార్టీ వెనుకేసుకున్న సొమ్ము 1400 కోట్ల రూపాయలకు పైగా బ్యాంకులో మూలుగుతోందని కవిత పేర్కొన్నారు. రాష్ట్ర సాధన కోసం ఉద్యమాలు చేసిన ప్రజలు రోడ్లపై తిరుగుతున్నారని, చిన్నపాటి ఉపాధి కోసం అగచాట్లు పడుతున్నారని అన్నారు. ఇలాంటి వారికి ఆ సొమ్ములు తక్షణమే పంపిణీ చేయాలని టీఆర్ఎస్ తరఫున తాము పోరాటం చేస్తామని హెచ్చరించారు.
`బాయిబాట` కార్యక్రమంలో భాగంగా సింగరేణిలో భాగమైన కొత్తగూడెంలో గురువారం పర్యటించారు. ఈ సందర్భంగా కార్మికుల కుటుంబాలతో కవిత మమేకమయ్యారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. తమ పార్టీ `టీఆర్ఎస్` అంటేనే బీఆర్ఎస్ నాయకులు ఒణుకుతున్నారని వ్యాఖ్యానించారు. వారికి నరనరాల్లోనూ భయం వెంటాడుతోందన్నారు. అందుకే టీఆర్ఎస్ను అడ్డుకునేందుకు వేలాది ఉత్తరాలను ఎన్నికల సంఘానికి రాశారని ఆమె ఆరోపించారు. “మేం ఎన్నికల్లో పోటీ చేయకుండానే ఇంత భయపడుతున్నారా?“ అని ఎద్దేవా చేశారు.
చెల్లినని కూడా చూడకుండా తనపై ట్రోలింగ్ చేయిస్తున్నారని.. మాజీ మంత్రి కేటీఆర్‌పై పరోక్షంగా విమర్శలు గుప్పించారు. ఇంటి ఆడపడుచు, తెలంగాణ బిడ్డ అని కూడా చూడకుండా తనను విమర్శిస్తున్నారని వ్యాఖ్యానించారు. తన కంఠంలో ప్రాణం ఉన్నంత వరకు బీఆర్ఎస్ గడప కూడా తొక్కనని చెప్పారు. తన రాజకీయం, రాజకీయ జీవితం అంతా కూడా ప్రజలతోనే ముడిపడి ఉంటుందని తేల్చి చెప్పారు. అంతే తప్ప.. వెనక్కి తిరిగి వెళ్లే ప్రసక్తే లేదని పేర్కొన్నారు.
Gulte Telugu Telugu Political and Movie News Updates