తెలంగాణలో గంజాయి సాగు, రవాణా, వాడకం గతంతో పోలిస్తే చాలా పెరిగిన సంగతి తెలిసిందే. గంజాయి స్మగ్లింగ్ ను అరికట్టేందుకు ఈగల్ టీం, పోలీసులు ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నా, కఠిన చర్యలు తీసుకుంటున్నా పెద్దగా ఉపయోగం ఉండడం లేదు. ఈ క్రమంలోనే అందుకు గల కారణాలను వివరించే క్రమంలో తెలంగాణ డీజీపీ సీవీ ఆనంద్ కీలక వ్యాఖ్యలు చేశారు. మావోయిస్టులు తగ్గడం వల్లే గంజాయి సాగు పెరిగిందని ఆయన చేసిన వ్యాఖ్యలు వైరల్ అయ్యాయి.
గతంలో గంజాయి పండించి సరఫరా చేసే ప్రాంతాలన్నీ మావోయిస్టు ప్రభావిత ప్రాంతాలని ఆనంద్ చెప్పారు. గంజాయి స్మగ్లర్లు, గంజాయి పండించే వారి పట్ల మావోయిస్టులు కఠినంగా వ్యవహరించేవారని తెలిపారు. మావోయిస్టుల కార్యకలాపాలు తగ్గడంతో మళ్లీ గంజాయి ధందా పెరిగిందని అన్నారు.
గంజాయి పండించి, అమ్మేవారిని మావోయిస్టులు శిక్షించేవారని, అయితే, మావోయిస్టులు తగ్గిపోవడంతో గంజాయి రవాణా పెరిగిందని, ఇలా విస్తరించిందని ఆనంద్ చెప్పారు. గంజాయి స్మగ్లర్ల కంటే మావోయిస్టులే బెటర్ అని ఆనంద్ చేసిన కామెంట్లు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.
గ్రేహౌండ్స్ దళాలను వేరే పనికి వాడతామని, అయినా వాళ్లొక్కరే గంజాయి సాగు, రవాణా అరికట్టలేరని చేయలేరని చెప్పారు. జిల్లా పోలీసులు, ఈగల్ టీంలు కలిసి గంజాయి సాగు, రవాణా అరికట్టాలని అన్నారు. మాదకద్రవ్యాలతో దేశానికి, రాష్ట్రానికి ముప్పు పొంచి ఉందని, వీటికి అలవాటు పడితే యువత భవిష్యత్తు అంధకారమవుతుందని హెచ్చరించారు. మాదకద్రవ్యాలు రవాణా చేసే వారిపై పీడీ యాక్ట్ కింద కేసులు పెడతామని హెచ్చరించారు.
Gulte Telugu Telugu Political and Movie News Updates