ఆంధ్రప్రదేశ్‌కు విదేశీ పెట్టుబడులను ఆకర్షించే లక్ష్యంతో దక్షిణ కొరియాలో పర్యటిస్తున్న రాష్ట్ర ఐటీ, విద్య, ఎలక్ట్రానిక్స్ శాఖ మంత్రి నారా లోకేష్ బృందానికి అక్కడి పారిశ్రామిక వర్గాల నుంచి ప్రశంసలు లభిస్తున్నాయి. కొరియా ట్రేడ్-ఇన్వెస్ట్‌మెంట్ ప్రమోషన్ ఏజెన్సీ (కోట్రా) ఇండియా, దక్షిణాసియా విభాగాధిపతి క్యుంగ్‌హూన్ కిమ్ సామాజిక మాధ్యమం ఎక్స్‌లో స్పందిస్తూ.. “నారా లోకేష్ బృందానికి హ్యాట్సాఫ్” అని అభినందించారు.
లోకేష్ బృందం ఆంధ్రప్రదేశ్‌లోని పెట్టుబడి అవకాశాలు, ప్రభుత్వం అందిస్తున్న ప్రోత్సాహకాలను వివరిస్తూ షూఆల్స్, సోలమ్, ఏపాక్ట్, శాంసంగ్, ఎల్జీ, బూ యంగ్, హ్వాసెంగ్ తదితర ప్రముఖ సంస్థలతో సమావేశాలు నిర్వహించిందని పేర్కొన్నారు. పర్యటన ఇంకా కొనసాగుతుండగా సియోల్‌లో జరగనున్న రోడ్‌షోపై కూడా ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.
సాధారణంగా విదేశీ పర్యటనల్లో మర్యాదపూర్వక సమావేశాలకే పరిమితమయ్యే ప్రభుత్వ బృందాలు, ఈసారి మాత్రం పెట్టుబడుల కోసం నేరుగా సంస్థల యాజమాన్యాలతో చర్చలు జరపడం విశేషం. ఒక్కో కంపెనీ అవసరాన్ని బట్టి ప్రత్యేక ప్రతిపాదనలు ఉంచడం, ఆంధ్రప్రదేశ్‌ను తయారీ, ఎలక్ట్రానిక్స్, సెమీకండక్టర్లు, కృత్రిమ మేధ, ఫుట్‌వేర్, విద్యుత్ పరికరాల కేంద్రంగా తీర్చిదిద్దే ప్రణాళికలను వివరించడం కొరియా పరిశ్రమల దృష్టిని ఆకర్షించిన అంశాలుగా భావిస్తున్నారు.
ఈ నేపథ్యంలో లోకేష్ బుసాన్‌లోని షూఆల్స్ స్మార్ట్ హెల్త్‌కేర్ ఫుట్‌వేర్ తయారీ కేంద్రాన్ని సందర్శించారు. మెడికల్ మాగ్నెటిక్ టెక్నాలజీ, వైబ్రేషన్ చిప్‌లతో తయారయ్యే పాదరక్షల తయారీ విధానాన్ని పరిశీలించారు. అలాగే హ్వాసంగ్ గ్రూప్ ప్రతినిధులతో సమావేశమై కుప్పంలో ఏర్పాటు చేయనున్న పాదరక్షల తయారీ యూనిట్ పనులను వేగవంతం చేయాలని, భవిష్యత్తులో ఆంధ్రప్రదేశ్‌లో హ్వాసంగ్ తయారీ క్లస్టర్ ఏర్పాటు చేయాలని కోరారు.
పర్యటనలో అత్యంత కీలక ఘట్టంగా భావిస్తున్న సియోల్ రోడ్‌షోలో మరిన్ని కొరియా సంస్థలను ఆంధ్రప్రదేశ్‌లో పెట్టుబడులు పెట్టేలా ఆహ్వానించనున్నారు. ఈ పర్యటన ద్వారా రాష్ట్రానికి కొత్త పారిశ్రామిక భాగస్వామ్యాలు, పెట్టుబడులు లభిస్తాయనే అంచనాలు వ్యక్తమవుతున్నాయి.
Gulte Telugu Telugu Political and Movie News Updates