మండలిలో దద్దమ్మ.. ఆంబోతు… వ్యాఖ్యలు

ఈ రోజు నుంచి ఏపీ అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు ప్రారంభమయ్యారు. ఈ నెల 17 నుంచి 20 వరకు ఈ సమావేశాలు జరగనున్నాయి. యథా ప్రకారం వైసీపీ సభ్యులు అసెంబ్లీకి డుమ్మా కొట్టారు. అయితే, ఎప్పటిలాగే తమకు సంఖ్యా బలం ఉన్న మండలికి మాత్రం హాజరయ్యారు. ఈ క్రమంలోనే తొలి రోజు సమావేశాల సందర్భంగా మండలిలో డీఎస్సీపై వాడీవేడీ చర్చ జరిగింది. ఈ క్రమంలోనే మంత్రి అచ్చెన్నాయుడు, వైసీపీ ఎమ్మెల్సీ బొత్స సత్యన్నారాయణల మధ్య మాటల యుద్ధం మొదలైంది.

వైసీపీ హయాంలో విద్యాశాఖా మంత్రిగా ఉన్న బొత్స తమ గొడ్డలి పార్టీ అధ్యక్షుడుకి చెప్పి విద్యార్థుల కోసం ఒక్క నోటిఫికేషన్ కూడా వేయించలేదని, అటువంటి దద్దమ్మ బొత్స ఇప్పుడు మాట్లాడుతున్నారని అచ్చెన్నాయుడు మండిపడ్డారు. తాము డీఎస్సీ నిర్వహిస్తే 300 కేసులు వేశారని, మీకు సిగ్గు లేదా అని కోర్టు చీవాట్లు పెట్టిందని గుర్తు చేశారు. గొడ్డలి పార్టీ వ్యక్తం చేసిన ప్రతి అనుమానానికి, ప్రతి పాయింట్ కు సమాధానం చెప్పేందుకు తాము సిద్ధంగా ఉన్నామని అచ్చెన్న అన్నారు.

ఈ క్రమంలోనే అచ్చెన్నా కామెంట్లపై బొత్స కౌంటర్ ఇచ్చారు. మనిషి ఎద్దులా పెరిగితే బుద్ధి రాదని, తెలివితేటలు రావని అన్నారు. ఎవరు దద్దమ్మో, ఎవరు ఆంబోతులా ఉన్నారో, ఎవరి మంత్రిత్వ శాఖలో రైతులు ఇబ్బంది పడుతున్నారో అందరికీ తెలుసని బొత్స తీవ్రంగా స్పందించారు. అయితే, సభలో ఇటువంటి భాష మాట్లాడడం సరికాదని, ఆ వ్యాఖ్యలను అచ్చెన్న ఉపసంహరించుకోవాలని బొత్స డిమాండ్ చేశారు.