వైసీపీ అధినేత జగన్‌పై జనసేన కీలక నాయకుడు, మంత్రి కందుల దుర్గేష్ ఆగ్రహం వ్యక్తం చేశారు. తుగ్లక్ నిర్ణయాలు ఆపండి అంటూ జగన్‌పై ఫైరయ్యారు. తాజాగా జగన్ చేసిన మావిగన్ రాజధాని ప్రకటనపై మంత్రి మీడియాతో మాట్లాడుతూ.. జగన్ తన మాటలకు తానే నిలకడ లేకుండా వ్యవహరిస్తున్నారని వ్యాఖ్యానించారు. గతంలో రాజధానికి జై కొట్టారని.. అధికారంలోకి వచ్చిన తర్వాత మూడు రాజధానుల పేరుతో మూడు ముక్కలాట ఆడారని, రాజధాని రైతులను దుర్భాషలాడి వారిపై కేసులు కూడా పెట్టించారని అన్నారు. 2024లో రాజధాని అమరావతికి ప్రజలు స్పష్టమైన తీర్పు ఇచ్చారని అన్నారు.
అయితే.. ఇప్పుడు మళ్లీ.. మావిగన్ పేరుతో మరో నాటకానికి తెరదీశారని కందుల వ్యాఖ్యానించారు. ఇలాంటి వ్యాఖ్యలు చూసి ప్రజలు నవ్వుకుంటున్నారని, తుగ్లక్ చర్యలతో ఇప్పటికే రాష్ట్రాన్ని దివాలా తీయించారని దుయ్యబట్టారు. పెట్టుబడులు కూడా వెనక్కి పోయాయని అన్నారు. వాటిని కూటమి ప్రబుత్వం తిరిగి సాధిస్తోందని తెలిపారు. అదేసమయంలో రాజధాని అనేది.. ఏ రాష్ట్రానికైనా గుండె వంటిదని.. దానిని ప్రతి ఐదేళ్లకు ఒకసారి మారుస్తామంటే ప్రజలు సహించరని వ్యాఖ్యానించారు. జగన్ ఈ విషయంలో ఏం ఆలోచన చేస్తున్నారో కూడా అర్ధం కావడం లేదని అన్నారు.
ప్రస్తుతం ప్రజలు 11 స్థానాలకు పరిమితం చేసినా.. జగన్‌లో మార్పు రావడం లేదని కందుల దుయ్యబట్టారు. ప్రజాస్వామ్యంలో ప్రజలు ఇచ్చిన తీర్పును కూడా అపహాస్యం చేస్తున్నారని విమర్శించారు. ప్రజలు రాజధానిగా అమరావతిని కోరుకుంటున్నారని చెప్పారు. అందుకే కూటమి పార్టీలకు భారీ మెజారిటీ ఇచ్చి గెలిపించారని వ్యాఖ్యానించారు. వచ్చే ఎన్నికల్లో తాను విజయం దక్కించుకుంటే మావిగన్‌ను రాజధాని చేస్తానని చెబుతున్న జగన్.. ఇప్పుడే ఎన్నికల యావలో ఉన్నారని దుయ్యబట్టారు. అధికారం పోయినా.. జగన్‌లో ఇంకా అహంకారం పోలేదని అన్నారు.
రాష్ట్రంలో పాలన సవ్యంగా జరుగుతోందని, ప్రజలు సంతోషంగా ఉన్నామని చెబుతున్నారని కందుల వ్యాఖ్యానించారు. కానీ, జగన్ మాత్రం దురదృష్టకర రాజకీయాలకు తెరదీసి.. ఇంకా అజ్ఞానంలోనే జీవిస్తున్నారని దుయ్యబట్టారు. ఐదేళ్లు ప్రతిపక్షంలో కూర్చోమని వైసీపీకి ప్రజలు తీర్పు ఇస్తే.. దానిని వదిలేసి, రాజకీయాలకే పరిమితం అవుతున్నారని విమర్శించారు. జగన్ లాంటి విపక్ష నేత ఉండడం రాష్ట్రానికి దురదృష్టకరమని అన్నారు.
Gulte Telugu Telugu Political and Movie News Updates