భగీరథ్ పై కోర్టులో బాధితురాలు ఏం చెప్పబోతోంది?

పోక్సో కేసులో అరెస్టైన బండి భగీరథ్ చర్లపల్లి జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్న సంగతి తెలిసిందే. ఇంజనీరింగ్ పరీక్షలు రాసేందుకు భగీరథ్ కు జూన్ 20 నుంచి 24 వరకు తెలంగాణ హైకోర్టు అనుమతినిచ్చింది. అయితే, తనకు రెగ్యులర్ బెయిల్ ఇవ్వాలంటూ భగీరథ్ దాఖలు చేసిన పిటిషన్ పై మాత్రం విచారణ కొనసాగుతోంది. ఈ క్రమంలోనే తాజాగా బాధితురాలి వాదనలు విన్న తర్వాతే రెగ్యులర్ బెయిల్ పై నిర్ణయం తీసుకుంటామని ఈ రోజు తెలంగాణ రాష్ట్ర ఉన్నత న్యాయస్థానం తేల్చి చెప్పింది.

బండి భగీరథ్ రెగ్యులర్ బెయిల్ పిటిషన్‌పై తెలంగాణ హైకోర్టులో బుధవారం విచారణ జరిగింది. భగీరథ్ పై నమోదైన పోక్సో కేసు పూర్తిగా రాజకీయ ప్రేరేపితమని అతడి తరఫు లాయర్లు వాదనలు వినిపించారు. భగీరథ్ ఏ తప్పూ చేయలేదని, పోలీసుల విచారణకు పూర్తిగా సహకరిస్తున్నాడని వాదించారు. కాబట్టి భగీరథ్ క రెగ్యులర్ బెయిల్ మంజూరు చేయాలని కోరారు.

అయితే, ఆ బెయిల్ పిటిషన్‌పై నిర్ణయం తీసుకునే ముందు బాధితురాలి వాదన కూడా వినాల్సి ఉందని హైకోర్టు న్యాయమూర్తి పేర్కొన్నారు. ఈ ప్రకారం కౌంటర్ దాఖలు చేయాలని బాధితురాలికి నోటీసులు జారీ చేశారు. ఈ కేసు తదుపరి విచారణను జూలై 3వ తేదీకి వాయిదా వేశారు. దీంతో, బాధితురాలి తరఫున ఆమె లాయర్లు ఏ విధంగా వాదనలు వినిపించబోతున్నారు అన్నది ఆసక్తికరంగా మారింది. ఎల్లుండి కోర్టు ఏ నిర్ణయం తీసుకుంటుందనే అంశంపై ఆసక్తి ఏర్పడింది.