ఏ విషయంపైనైనా ముందు తాను మాట్లాడిన తర్వాతే.. సీఎం చంద్రబాబు స్పందిస్తున్నారని వైసీపీ అధినేత జగన్ వ్యాఖ్యానించారు. ఇటీవల కృష్ణలంకకు చెందిన సాయికృష్ణ దారుణ ఘటనకు సంబంధించి తాను వెళ్లి బాధిత కుటుంబాన్ని పరామర్శించిన తర్వాతే.. ఈ ప్రభుత్వంలో కొంచెమైనా చలనం కలిగిందన్నారు. అప్పటి వరకు కనీసం సాయికృష్ణ తల్లి ఇచ్చిన ఫిర్యాదులను కూడా డీజీపీ సైతం తీసుకోలేదని తెలిపారు. ఈ ఘటనపై చంద్రబాబుకు అంత ఇంట్రస్ట్ ఏంటని ప్రశ్నించారు.
సాయికృష్ణ ఉదంతంలో సీఐని సీపీ కాపాడుతున్నారని, సీపీని డీజీపీ కాపాడుతున్నారని, డీజీపీని ఎవరు కాపాడుతున్నారో అందరికీ తెలుసునని జగన్ వ్యాఖ్యానించారు. సాయికృష్ణ తల్లి కనీసం పిడికెడు బూడిద ఇమ్మన్నా ఈ ప్రభుత్వానికి చలనం లేకుండా పోయిందని వ్యాఖ్యానించారు. ఇక, గత ఏడాది మామిడి ధర విషయంలో నెలకొన్న సంక్షోభం విషయంలోనూ.. తాను స్పందిస్తే తప్ప ప్రభుత్వం స్పందించలేదన్నారు. పంట అంతా అయిపోయాక రైతులకు కిలోకు 12 రూపాయలు ఇస్తామన్నారని విమర్శించారు.
రైతులకు మద్దతుగా తాను బంగారుపాళ్యం వెళ్లి పరామర్శించిన తర్వాత.. కేంద్రానికి లేఖ రాశారని వ్యాఖ్యానించారు. ధరలు పతనం కావడంతో గత ఏడాదిలానే ఈ ఏడాది కూడా రైతులకు మేలు చేసేలా కేంద్రం ప్రయత్నం చేయాలని సూచించారు. కేంద్ర ప్రభుత్వంలో భాగస్వామి, కేంద్ర మంత్రి కుమార స్వామి జూన్ 24న లేఖరాస్తే, జూన్ 25న కేంద్ర వ్యవసాయశాఖమంత్రి శివరాజ్‌సింగ్ చౌహాన్ నుంచి మామిడి కొనుగోలుకు సానుకూల స్పందన వచ్చిందన్నారు.
రాష్ట్ర ప్రయోజనాలను కాపాడుతానని చెబుతున్న చంద్రబాబు.. రైతులకు ఏం మేలు చేస్తున్నారని ప్రశ్నించారు. రాష్ట్రంలో కూడా మామిడి రైతులకు ధర రావడంలేదని, అయినా.. ఆయన పట్టించుకోవడం లేదని వ్యాఖ్యానించారు. చంద్రబాబుగారు తీరిగ్గా జూన్ 28న లేఖ రాశారని అన్నారు. చంద్రబాబు తన వారైన గల్లా ఫుడ్స్, శ్రీని ఫుడ్స్ కే న్యాయం జరగాలి అన్నట్టుగా వ్యవహరిస్తారని విమర్శించారు.
Gulte Telugu Telugu Political and Movie News Updates