వైసీపీ అధినేత జగన్ కూటమి ప్రభుత్వంపై భారీ ఎత్తున విమర్శలు చేసిన నేపథ్యంలో ఇదేసమయంలో ఏపీ సీఎం చంద్రబాబు.. నెల్లూరులో నిర్వహించిన కార్యక్రమంలో వైసీపీ పై నిప్పులు చెరిగారు. వైసీపీని విధ్వంసకర పార్టీగా ఆయన అభివర్ణించారు. ఆ పార్టీ ప్రభుత్వం రాష్ట్రాన్ని ధ్వంసం చేసిందన్నారు. అన్ని వ్యవస్థలను కూడా నీరు గార్చిందని దుయ్యబట్టారు. ప్రతి వ్యవస్థను ధ్వంసం చేసిందని విమర్శించారు. రాష్ట్రంలో గొడ్డలి పార్టీ ఉంది. దీనిని మీరు కూడా గొడ్డలి పార్టీ అనే పిలవాలి అని చంద్రబాబు వ్యాఖ్యానించారు.
ప్రజల ఆశీర్వాదంతో అధికారంలోకి వచ్చిన కూటమి పార్టీలు రాష్ట్రాన్ని అన్నివిధాలా గాడిలో పెడుతున్నామని చంద్రబాబు తెలిపారు. రాష్ట్రంలో ఎవరిది అభివృద్ధి-ఎవరిది విధ్వంసం అనేది అందరికీ తెలిసిందేనన్నారు. ప్రజలు ఇచ్చిన అధికారాన్ని ప్రజల కోసమే వినియోగిస్తున్నామన్నారు. పేదల సేవలో కార్యక్రమంలో భాగంగా నెల్లూరులో నిర్వహించిన కార్యక్రమంలో లబ్ధిదారులకు సామాజిక భద్రతా పింఛన్లను చంద్రబాబు పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా ఆయన.. వైసీపీ పాలనపైనా, జగన్‌పైనా తీవ్ర విమర్శలు గుప్పించారు. వైసీపీ హయాంలో ప్రజలు పడ్డ అవస్థలను మరిచిపోరాదని గుర్తు చేశారు. ప్రజాపాలనలో ఎవరికీ ఇబ్బంది లేకుండా వ్యవస్థలను గాడిలో పెడుతున్నామన్నారు. అన్ని ప్రాంతాలను సమానంగా అభివృద్ధి చేస్తున్నట్టు చంద్రబాబు చెప్పారు. రాష్ట్రంలో ప్రతి ఒక్కరి ఆనందం కోసం తాను నిరంతరం కష్టపడుతున్నానని పెట్టుబడులు తీసుకువచ్చి అభివృద్ధిని చేసి చూపిస్తున్నామన్నారు.
నేను బటన్ కాదు!
నాకు కూడా బటన్‌నొక్కడం వచ్చు. కానీ, నేను బటన్ నొక్కే వ్యక్తి కాదు. ప్రజల కష్టసుఖాలను నేరుగా చూసి.. దానికి అనుగుణంగా పాలన అందించాలని నిర్ణయించాం అని చంద్రబాబు వ్యాఖ్యానించారు. గొడ్డలి పార్టీ రోజుకో విన్యాసం చేస్తోందని దుయ్యబట్టారు. కులం, మతం, ప్రాంతం పేరుతో చిచ్చు పెట్టే పనికి ఆ పార్టీ పూనుకొందన్నా రు. గంజాయి, బ్లేడ్ బ్యాచ్ అరాచకాలకు ఆ పార్టీ పెట్టింది పేరని దుయ్యబట్టారు. రాష్ట్రంలో గొడ్డలి పార్టీ అనేది ఉంది. మీరు కూడా దానిని గొడ్డలి పార్టీ అనే పిలవాలి. అని పిలుపునిచ్చారు.
Gulte Telugu Telugu Political and Movie News Updates