పవన్ కళ్యాణ్ భుజాల లోపల కలిగిన గాయం ఊహించిన దానికంటే తీవ్రంగా ఉన్నట్లు వైద్యులు నిర్ధారించారు. ముంబైలోని కోకిలాబెన్ ధీరూభాయ్ అంబానీ ఆసుపత్రిలో నిర్వహించిన పరీక్షల్లో రొటేటర్ కఫ్ తో పాటు రెండు భుజాల కండరాల్లో తీవ్ర చీలికలు ఉన్నట్లు తేలింది. వెంటనే శస్త్ర చికిత్స చేయించుకోవాలని వైద్యులు సూచించారు.
అయితే పవన్ మాత్రం వెంటనే ఆపరేషన్ చేయించుకునే ఆలోచనలో లేరు. ఇప్పటికే నిర్ణయించిన పాలనాపరమైన కార్యక్రమాలు, అధికారిక బాధ్యతలు పూర్తి చేసిన తర్వాతే శస్త్ర చికిత్స చేయించుకోవాలని నిర్ణయించినట్లు జనసేన పార్టీ కార్యాలయం అధికారిక ప్రకటన వెల్లడించింది.
ఆరోగ్యం కంటే ముందుగా బాధ్యతలకు ప్రాధాన్యం ఇవ్వడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. డిప్యూటీ సీఎం హోదాలో ఉన్న కీలక కార్యక్రమాలను మధ్యలో వదిలేయకుండా పూర్తి చేయాలనే ఉద్దేశంతో ఆయన ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.
కొంతకాలంగా భుజం నొప్పితో ఇబ్బంది పడుతున్నప్పటికీ పవన్ కళ్యాణ్ వరుసగా అధికారిక కార్యక్రమాల్లో పాల్గొంటూనే ఉన్నారు. ఇప్పుడు గాయం మరింత తీవ్రంగా మారడంతో వైద్యులు శస్త్ర చికిత్సను వాయిదా వేయొద్దని స్పష్టంగా సూచించినట్లు సమాచారం.
శస్త్ర చికిత్స పూర్తయిన తర్వాత కొంతకాలం విశ్రాంతితో పాటు ఫిజియోథెరపీ కూడా అవసరం కానుంది. గాయం తీవ్రతను బట్టి కోలుకోవడానికి కొన్ని నెలల సమయం పట్టే అవకాశం ఉందని వైద్య నిపుణులు చెబుతున్నారు.
గత నెలలోనే పవన్ శ్వాస సంబంధిత శాస్త్ర చికిత్స జరుపుకొని నెల రోజుల పాటు విశ్రాంతి తీసుకున్న సంగతి తెలిసిందే.
Gulte Telugu Telugu Political and Movie News Updates