ఇడుపు కాయితం ఇష్యూలోకి పవన్ ను టార్గెట్ చేసుడేంది కవిత?

ఒకరు వెళుతుంటే నలుగురు నానా మాటలు అనటం కొత్తేం కాదు. ఎప్పుడైతే సమాజం సోషల్ మీడియాలోకి షిప్ట్ అయ్యిందో.. ఆ పైత్యాలు సోషల్ మీడియా వేదికగా చేసుకోవటం ఎక్కువైంది. విచక్షణ మరిచి.. మర్యాదల్ని వదిలేసి నలుగురు ముందు నోటికి వచ్చినట్లు మాట్లాడే ఎంతోమందికి.. సోషల్ మీడియా ఇప్పుడో వరమైంది. ఎందుకంటే.. తమ పైత్యాన్ని సోషల్ మీడియాలో ప్రదర్శిస్తే నలుగురేంటి ఖర్మ.. నాలుగు వేలు.. ఒకవేళ సదరు పోస్టు వైరల్ అయితే నలభై లక్షల మందికి చేరుతుంది. అది కూడా ప్రాంతంలో సంబంధం లేకుండా.. ప్రపంచంలో ఏ మూల ఉన్న తెలుగోళ్లు అయినా చూసే వీలుంటుంది. దీన్నో అసరాగా చేసుకొని.. గొడవలు పెట్టే పనిలో కొందరు.. వివాదాలకు విధాతలుగా మారాలన్న కక్కుర్తి ఈ మధ్యన ఎక్కువైంది.

భావస్వేచ్ఛ పేరుతో ఇష్టం వచ్చినట్లుగా మాట్లాడుతూ.. వివాదాలకు తెర తీస్తూ.. తాము పాపులర్ కావటం కొందరు సెలబ్రిటీల్లోనూ ఎక్కువైంది. ఈ పైత్యం ఎక్కువగా ఉన్నోళ్లు.. నిత్యం తమ కడుపులో ఉన్న విషాన్ని వెదజల్లేందుకు ఏ చిన్న అవకాశం లభిస్తుందా? అన్నట్లు వ్యవహరిస్తుంటారు. అలాంటివారికి ‘ఇడుపు కాయితం ’ పేరుతో నిర్మిస్తున్న మూవీ ఒక ముడి సరుకుగా మారింది. సినిమాను పాపులర్ చేయాలన్న అత్యాశ (?)తో జరిగిందో?.. లేదంటే.. నిజంగానే పైత్యం ప్రకోపించి నోటికి వచ్చినట్లుగా మాట్లాడే తరహాలో సోషల్ మీడియాలో పోస్టులు పెట్టేస్తూ.. వివాదాన్ని రాజేయాలన్న కుట్రతో మొదలు పెట్టారో కానీ.. ఇష్యూను రాజేసే విషయంలో సక్సెస్ అయ్యారు.

‘ఇడుపు కాగితం’ వివాదాన్ని సింఫుల్ గా నాలుగు మాటల్లో చెప్పాలంటే.. ప్రియదర్శి.. జానపద నృత్యకారిణి నాగదుర్గ ప్రధాన పాత్రల్లో వంశీరెడ్డి దొండపాటి దర్శకత్వంలో ఈ మధ్యనే ఈ సినిమా పూజా కార్యక్రమాల్ని చేపట్టారు. ఈ టైటిల్ అర్థం ఏమంటే.. తెలంగాణ గ్రామీణ ప్రాంతాల్లో భార్యాభర్తలు విడిపోయేటప్పుడు పెద్దల సమక్షంలో రాసుకునే విడాకుల ఒప్పంద పత్రాన్ని ఇడుపు కాయితం అంటారు. తెలంగాణ గ్రామీణ ప్రాంతం యాస మీద అవగాహన లేని వారికి ఇది అర్థం కాదు.

ఇప్పుడున్న పరిస్థితుల్లో ప్రేక్షకుల్లో ఉత్సుకత రేపే ఏ చిన్న అవకాశాన్ని వదులుకోరు. అందునా అది వ్యాపారం అయితే.. ఆ తీరు ఎక్కువగా ఉంటుంది. ఇడుపు కాయితం పేరుతో మూవీని అనౌన్స్ చేసినంతనే.. కొందరు ఇదేం పేరు? ఆంధ్రాలో రిలీజ్ చేస్తే సబ్ టైటిల్స్ వేయాలా? అంటూ వ్యంగ్యంగా.. వెటకారంగా పోస్టులు పెట్టటం పలువురిని బాధించింది. ఇక్కడే ఒక విషయాన్ని గుర్తించాలి. నిజంగా ఒక తెలియని విషయాన్ని తెలుసుకోవాలన్న మంచి బుద్ధి ఉన్న వారెవరు ఎటకారం చేయరు? దీనికి అర్థమేంటి? అని మాత్రం అడుగుతారు.

అందుకు భిన్నంగా స్పందిస్తున్నారంటేనే.. పక్కా ప్లాన్ తోనే వ్యవహరిస్తున్నట్లుగా చెప్పక తప్పదు. ఎప్పుడైతే ఈ సినిమా టైటిల్ మీద వ్యంగ్యంగా.. ఎటకారంగా పోస్టులు పెట్టారో.. దానికి ప్రతిగా తెలంగాణ నెటిజన్లు.. ప్రముఖులు తీవ్రంగా తప్పు పట్టారు. ఇక్కడే మరో విషయాన్ని ప్రస్తావించాలి. ఇంతకూ ఎటకారం.. వ్యంగ్యంగా.. చులకనగా చేసినోళ్లు ఎవరు? వారి అకౌంట్లు ఏంటి? అన్న విషయాన్ని వెతికితే.. వారి ఉనికి ఏ మాత్రం ప్రభావం చూపేదిగా లేకపోవటం కనిపిస్తుంది.

అదే సయంలో తమ యాసను అవమానిస్తారా? కొత్త రాష్ట్రంగా ఏర్పడిన ఇన్నేళ్ల తర్వాత కూడా తెలంగాణ భాషను.. యాసలపై ఇదేం వివక్ష అంటూ కొందరు తమ ఆవేదనను వ్యక్తం చేస్తూ పోస్టులు పెట్టారు. నిజమే.. ఎవరి యాస వారికి గొప్ప. వీలైతే దాన్ని గౌరవించటం.. లేదంటే దాని గురించి తెలుసుకునే ప్రయత్నం చేయాలే కానీ.. పైత్యపు మాటలు ఏ మాత్రం మంచిది కాదు. ఈ విషయంలో నోటికి వచ్చినట్లుగా మాట్లాడిన వారిది ముమ్మాటికి తప్పే. నిజానికి ఇలా ఇష్టం వచ్చినట్లుగా పోస్టులు పెట్టి.. భావోద్వేగాల్ని రెచ్చగొట్టేలా వ్యవహరించే వారిని పోలీసులు సుమోటోగా తీసుకొని.. విచారించి.. వారి నేపథ్యం.. వారెందుకు ఇలా వ్యవహరిస్తున్నారన్న విషయాన్ని తేల్చి.. చట్టప్రకారం చర్యలు తీసుకుంటే.. సోషల్ మీడియానే కదా? ఇష్టం వచ్చినట్లుగా మాట్లాడితే ఏమవుతుంది? ఎవరేం చేస్తారన్నట్లుగా బాధ్యత లేకుండా వ్యవహరించే వారిని కట్టడి చేయాల్సిన అవసరం ఉంది.

సోషల్ మీడియాలో నాలుగు పోస్టులతో మొదలైన వివాదాన్ని తెలంగాణ రక్షణ సేన అధినేత్రి కల్వకుంట్ల కవిత రియాక్టు అయ్యారు. ఇడుపు కాయితం అంటే ఏంటో డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ను అడిగితే బాగా చెబుతారంటూ రాజకీయంగా ఎద్దేవా చేయటం ఈ ఇష్యూలో మరో మలుపుగా మారింది. సోషల్ మీడియాలో నలుగురు బుద్ధి లేనోళ్లు నోటికి వచ్చినట్లుగా వాగితే.. వారిపై చట్టపరమైన చర్యలకు డిమాండ్ చేయటం.. లేదంటే పోలీసులకు ఫిర్యాదు చేసి.. ఇలాంటి వారి వల్ల ప్రాంతీయ ఉద్రిక్తతలకు కారణమవుతుందన్న విషయాన్ని తెలియజేసి.. పెద్ద మనిషి తరహాలో వ్యవహరించాల్సింది పోయి.. సంబంధం లేని పవన్ కల్యాణ్ ను ఈ ఇష్యూలోకి లాగే ప్రయత్నం జరగటం గమనార్హం.

ఈ వివాదంపై చిత్రనిర్మాణ బన్నీవాస్ స్పందిస్తూ.. సినిమా కథా నేపథ్యానికి అనుగుణంగానే ఈ టైటిల్ పెట్టామని.. కథను కానీ.. సినిమా పేరును కానీ మార్చే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. నిర్మాత మధుర శ్రీధర్ రెడ్డి.. నటుడు రాహుల్ రామక్రిష్ణ లాంటి వారు కూడా తెలంగాణ మట్టి కథల అస్తిత్వాన్ని గౌరవించాలని నెటిజన్లను కోరారు. రోడ్డు మీద పోయే ఉన్మాది ఒకరు నోటికి వచ్చినట్లుగా మాట్లాడితే.. వాడి మాటల్ని పట్టించుకుంటామా? అలానే సోషల్ మీడియాలో ఇష్టం వచ్చినట్లుగా పోస్టులు పెడుతూ.. లేని ఉద్రిక్తతల్ని పెంచేలా.. మనసుల్ని వేదనకు గురి చేసేలా వ్యవహరించే వారిని వదిలేయకూడదు. వారిపై చట్టపరమైన చర్యల దిశగా ప్రయత్నాలు చేపట్టాలి.

అందుకు తగ్గట్లే.. సోషల్ మీడియాలో తిరిగి పోస్టులు పెట్టి తమ అభిప్రాయాల్ని షేర్ చేసే వారు జట్టుగా మారి.. పోస్టులతో సరిపెట్టకుండా చట్టపరమైన చర్యలకు ఉపక్రమించాల్సిన అవసరం ఉంది.
ఎందుకంటే ఈ రోజు ఇడుపు కాయితం అవుతుంది.. రేపొద్దున మరొకటి అవుతుంది. తమ మనసులోని వికారాల్ని సమాజం మీద రుద్దే దుర్మార్గాల్ని ఊరికే వదిలి పెట్టకూడదు. వారిపై చట్టపరమైన చర్యలు చాలా అవసరం.

ఇక.. కవిత విషయానికి వస్తే.. ఇలాంటి ఇష్యూస్ మీద స్పందించే సమయంలో బాధ్యత కలిగిన రాజకీయ పక్షంగా.. సమస్యను అడ్రస్ చేయాలే తప్పించి..దాన్ని మరింత రాజేసే ప్రయత్నం చేయకూడదు. పవన్ కల్యాణ్ వ్యక్తిగత జీవితాన్ని ప్రస్తావించే ధోరణిలో ఈ ఇష్యూలో ఆయన్ను లాగాల్సిన అవసరం ఏమిటి? అన్నది ప్రశ్న.

రాజకీయ ఉనికి కోసం ఆరాటం మంచిదే. అందుకు ప్రజా సమస్యలు బోలెడన్ని ఉన్నాయి. వాటి మీద ఫోకస్ చేయటం మంచిది. అందుకు భిన్నంగా.. ఈ తరహా వివాదాల్ని టేకప్ చేసినా తప్పు లేదు. కానీ..నిర్మాణాత్మకంగా ఉండాలే తప్పించి..ఎవడో దారిన పోయేటోడు ఇష్టం వచ్చినట్లు మాట్లాడితే..వాడితో ఏ మాత్రం సంబంధం లేని పవన్ కల్యాణ్ ను ఇష్యూలోకి లాగాల్సిన అవసరం కవితకు ఏముంది? నిజంగానే ఆమె మేలు చేయాలని భావిస్తే.. వెంటనే పోలీసులకు దీని మీద ఫిర్యాదు చేసి.. ప్రాంతీయ ఉద్రిక్తతలకు తెర తీసే కుట్రను చేధించాల్సిందిగా పోలీసుల్ని కోరాల్సిన బాధ్యత ఉంది.

కవిత స్పందనకు తగ్గట్లే.. జనసేన నేతలు స్పందించారు. ఆమెను టార్గెట్ చేస్తూ వ్యాఖ్యలు చేశారు. ఆమెను విమర్శిస్తూ కొన్ని వ్యాఖ్యలు చేశారు. ఇక్కడే మరికొన్ని అంశాలు చోటు చేసుకున్నాయి. వాటిని ప్రస్తావించి.. రచ్చ పెంచే ఉద్దేశం లేదు. ఎందుకంటే.. వివాద మూలాల్లోకి వెళ్లి.. దాన్ని పెకిలించే ప్రయత్నం చేయాలే తప్పించి.. మరింత రాజేయటం తెలుగు సమాజానికి నష్టం వాటిల్లేలా చేస్తుంది. పవన్ పేరును ఈ వివాదంలోకి తీసుకురావటం ద్వారా కవిత కోరుకుంటున్నది ఏమిటి? అన్నది ప్రశ్న.

తమ అధినేతను టార్గెట్ చేయటం ద్వారా కవిత లక్ష్యాన్ని గుర్తిస్తే జనసేన నేత బాగుండేది. కానీ.. అదేమీ జరగలేదు. ఇది సరిపోదన్నట్లుగా ఇలాంటి వివాదాలను రాజేసి.. రాజకీయలబ్ధి పొందాలనే కొన్ని పార్టీల ఐటీ వింగ్స్ ఈ ఇష్యూ మీద ఒక్కసారిగా యాక్టివ్ అవుతున్నట్లుగా చెబుతున్నారు. ఇలా చేయటం ద్వారా ప్రాంతీయ విభేదాలకు తెర తీసి.. వాటి ప్రయోజనాల్ని పొందాలన్న లక్ష్యంతో ఉన్నట్లు చెబుతున్నారు. ఇలాంటి ప్రయత్నాల్ని తెలంగాణ పోలీసులు ఒక కన్నేసి.. దాని సంగతి చూడాల్సిన అవసరం ఉంది. చిన్న విషయమే కదా అని వదిలేస్తే.. మరింత ముందుకు వెళ్లొచ్చు. మనసులో విషాన్ని నింపే ఏ ప్రయత్నాన్ని మొగ్గలోనే తుంచేయాల్సిన అవసరం ఉంది.