మార్కెట్‌లోకి మ‌న బంగారం.. ఏపీ ముద్ర కూడా!

ఉమ్మ‌డి క‌ర్నూలు జిల్లాలోని జొన్న‌గిరిలో బంగారు గ‌నుల నుంచి త‌వ్వి తీసిన ప‌సిడి మార్కెట్‌లోకి అందు బాటులోకి వ‌చ్చింది. సీఎం చంద్ర‌బాబు ఇటీవ‌లే ఈ గ‌నుల‌ను ద‌క్కించుకున్న ఓ ప్రైవేటు కంపెనీని ప్రారంభించారు. అప్ప‌టికే ప‌నులు ప్రారంభించిన కంపెనీ.. బంగారాన్ని వెలికి తీయ‌డంతోపాటు దానిని శుద్ధి చేసి బిస్కెట్ల రూపంలో అందుబాటులోకి తీసుకువ‌చ్చింది. ఈ బిస్కెట్లను సీఎం చంద్ర‌బాబుకు కానుక‌గా కూడా అందించారు.

తాజాగా ఈ బంగారం బిస్కెట్లు సాధార‌ణ పౌరుల‌కు కూడా అందుబాటులోకి వ‌చ్చాయి. ఒక్కొక్క బిస్కెట్ ను 50 నుంచి 100 గ్రాముల బ‌రువుతో రూపొందించారు. వీటిని క‌ర్నూలులోని బంగారం వ్యాపారుల‌కు విక్ర‌యించారు. రూ.405 కోట్ల పెట్టుబడితో ప్రారంభమైన ఈ భారీ ప్రాజెక్టును జొన్నగిరి ‘స్వర్ణగిరి’గా పిలుస్తున్నారు. ఇక‌, ఈ బిస్కెట్ల‌పై రాష్ట్ర మ్యాప్‌ను ముద్రించారు. తొలుత సీఎం చంద్ర‌బాబుకు అందించిన బిస్కెట్ల‌ను అమరావతిలో ఏర్పాటు చేయబోయే మ్యూజియంలో భద్రపరుస్తారు.

కర్నూలు జిల్లా పత్తికొండ సమీపంలోని జొన్నగిరి, ఎర్రగుడి, పగిడిరాయి గ్రామాలలో బంగారం గ‌నులు ఉన్నాయి. వీటిలో ఉత్పత్తి సామర్థ్యం 2 వేల ట‌న్నుల‌కుపైనే ఉంటుంది. అయితే.. ఒకేసారి కాకుండా విడ‌త‌ల వారీగా దీనిని త‌వ్వి తీయ‌నున్నారు. తొలి ఏడాది 400 కేజీలు, తదుపరి దశల్లో 900 కేజీల నుంచి దాదాపు 2 టన్నుల వరకు ఉత్పత్తి లక్ష్యంగా పెట్టుకున్నారు.

దేశంలోనే అతిపెద్ద ప్రైవేట్ గోల్డ్ మైనింగ్ ప్రాజెక్టుల్లో ఒకటిగా నిలిచిన జొన్న‌గిరి.. ద్వారాఏపీకి ప్ర‌త్యేక గుర్తింపు ల‌భించింది. ఇక్కడ తవ్విన బంగారాన్ని స్థానిక జ్యువెలరీ వ్యాపారులకే విక్రయించాలని సంస్థలు నిర్ణయించాయి. తాజాగా త‌వ్వి తీసిన బంగారాన్ని మార్కెట్ ధ‌ర‌కంటే కూడా 5 శాతం త‌క్కువ‌గా స్థానిక వ్యాపారుల‌కు విక్ర‌యిస్తున్న‌ట్టు సంస్థ ప్ర‌తినిధులు పేర్కొన్నారు. దీంతో త‌క్కువ ధ‌ర‌ల‌కే ఏపీ ప్ర‌జ‌ల‌కు ఈ బంగారం అందుబాటులోకి రానుంది.