కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామి ఆలయానికి భక్తుల నుంచి భారీ సంఖ్యలో విరాళాలు అందుతున్నాయి. ఈ నిధులతో వెంకన్న ఆలయాలతో పాటు ఇతరత్రా ఆలయాల నిర్మాణం, అభివృద్ధి, ఆయా ఆలయాల్లో భక్తుల సౌకర్యార్థం మౌలిక సదుపాయాల కల్పన పనులు చేపడుతున్నారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న శ్రీవారి భక్తులు సమర్పిస్తున్న విరాళాలను తిరుమల తిరుపతి దేవస్థానం(టీటీడీ) పాలక మండలి నిర్ణయం మేరకు వెచ్చిస్తున్నారు. అయితే షిరిడీ సాయి మందిరాలకు ఈ నిధులు అందడం లేదు. ఇదే విషయంపై తాజాగా వచ్చిన ఓ ప్రశ్నకు సమాధానం ఇచ్చిన ఏపీ దేవదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి ట్రస్టు నిధుల వినియోగంపై మరోమారు స్పస్టత ఇచ్చారు.
శ్రీవాణి నిధులను హిందూ ధర్మశాస్త్రంలో పేర్కొన్న ఆలయాలకు మాత్రమే వెచ్చించాల్సి ఉంది. ఈ నిబంధన మేరకే టీటీడీ నిర్ణయం తీసుకుంటూ ఉంది. తిరుమలతో పాటు ఇతరత్రా హిందూ ఆలయాలన్నింటికీ దాదాపుగా ఈ ట్రస్టు నిధులను వెచ్చించే అవకాశం ఉంది. అయితే షిరిడీ సాయి ఆలయాల విషయానికి వచ్చేసరికి ఈ ట్రస్టు నిధులను వెచ్చించడానికి వీల్లేని పరిస్థితులు ఉన్నాయి. ఎందుకంటే షిరిడీ సాయి ఆలయం హిందూ ధర్మశాస్త్రంలో పేర్కొనబడలేదు. హిందూ ధర్మశాస్త్రాల్లో పేర్కొన్న దేవాదిదేవుల ఆలయాల వృద్ది కోసం మాత్రమే ఈ నిధులు వెచ్చించాలని ఓ స్పష్టమైన నిబంధన అమలు అవుతోంది.
ఇవే అంశాలను ప్రస్తావించిన మంత్రి ఆనం… అయినా శ్రీవాణి ట్రస్టు నిధుల కోసం వేచి చూసే పరిస్థితి షిరిడీ సాయి ఆలయానికి లేదని చెప్పారు. హిందూ దేవుళ్లకు కేవలం హిందువులు మాత్రమే భక్తులుగా కొనసాగుతుండగా… షిరిడీ సాయికి హిందువులతో పాటుగా ఇతర మతాలకు చెందిన వారు కూడా భక్తులుగా ఉన్న విషయాన్ని మంత్రి తెలిపారు.
అంతేకాకుండా షిరిడీ సాయి భక్తులు పెద్ద సంఖ్యలో ఉన్నారని, వారి ద్వారా పోగవుతున్న విరాళాలతోనే షిరిడీ సాయి ఆలయాలు ఆశించిన దానికంటే కూడా అదికంగానే విస్తరిస్తున్నాయని తెలిపారు. ఇలాంటి పరిస్థితుల్లో షిరిడీ సాయి ఆలయాలకు శ్రీవాణి నిధులు తీసుకోవాల్సిన అవసరం ఎంతమాత్రం లేదని ఆయన తెలిపారు.
Gulte Telugu Telugu Political and Movie News Updates