వైసీపీ నేతల వ్యవహార తీరు అంతకంతకూ వివాదాస్పదంగా మారుతోందని చెప్పాలి. పల్నాడు జిల్లా వినుకొండ మాజీ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు తీరు ఇప్పుడు నిజంగానే పైన చెప్పినట్టే ఉందని చెప్పక తప్పదు. పొరుగు రాష్ట్రం తెలంగాణలో భూకబ్జాకు పాల్పడ్డారన్న ఆరోపణలతో అరెస్టు అయిన బొల్లా… బెయిల్ తీసుకుని బయటకు వచ్చిన సంగతి తెలిసిందే. ఈ వ్యవహారం బయటకు వచ్చిన తర్వాత ఏమాత్రం స్పందించని బొల్లా… ఇప్పుడు బెయిల్ పై బయటకు రాగానే… తనదైన శైలి వాదన వినిపిస్తున్నారు.
హైదరాబాద్ పరిధిలోని కోట్లాది రూపాయల భూమిని నకిలీ దస్తావేజులు సృష్టించి మరీ బ్రహ్మనాయుడు ఆ భూమిని తన సొంత చేసుకున్నారన్న ఆరోపణలు రెండు తెలుగు రాష్ట్రాల్లో కలకలం రేపిన సంగతి తెలిసిందే. ఈ వ్యవహారంలో బొల్లాకు ప్రత్యక్ష పాత్ర ఉందన్న ఆధారాలతో తెలంగాణ పోలీసులు ఆయనను అరెస్టు చేసేందుకు రాగా… మాజీ ఎమ్మెల్యే పరారైన సంగతి తెలిసిందే. అయితే ఇటీవలే బొల్లాను అరెస్టు చేసిన పోలీసులు ఆయనను కోర్టు ఆదేశాలతో జైలుకు పంపారు. తాజాగా ఈ కేసులో కోర్టు తనకు బెయిల్ మంజూరు చేయడంతో బొల్లా జైలు నుంచి విడుదలయ్యారు.
జైలు నుంచి బయటకు రాగానే..శనివారం వినుకొండలో పార్టీ కార్యకర్తల సమావేశాన్ని ఏర్పాటు చేసిన బొల్లా… టీడీపీ యువనేత, నరసరావుపేట ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలును టార్గెట్ చేస్తూ సంచలన వ్యాఖ్యలు చేశారు. భూకబ్జాల చరిత్ర ఎవరికి ఉందో ప్రజలకు తెలుసునన్న బొల్లా… శ్రీకృష్ణాదేవరాయలు మారిదిగా తాను పదవుల కోసం పార్టీ మారే వ్యక్తిని కాదన్నారు. భూకబ్జాలపై బహిరంగ చర్చకు తాను సిద్ధంగా ఉన్నానన్న ఆయన… చర్చకు రావాలని శ్రీకృఫ్ణదేవరాయలుకు సవాల్ విసిరారు.
అంతటితో ఆగని బ్రహ్మనాయుడు… తనతో చర్చకు శ్రీకృష్ణదేవరాయలు అవసరమైతే… టీడీపీ యువ నేత, మంత్రి నారా లోకేశ్ ను వెంట తెచ్చుకున్నా తనకేమీ ఇబ్బంది లేదని మరింత సంచలన వ్యాఖ్య చేశారు. ఈ వ్యవహారంపై తాను అయితే బహిరంగ చర్చకు సదా సిద్ధంగా ఉన్నానని ఆయన తెలిపారు. తనను ఎన్ని ఇబ్బందులు పెట్టినా.. శ్రీకృష్ణదేవరాయలు మాదిరిగా తల వంచే ప్రసక్తే లేదని ఆయన అన్నారు. వినుకొండ వస్తే తన నిజాయతీ ఏమిటో తెలుస్తుందని కూడా ఆయన పేర్కొనడం గమనార్హం.
Gulte Telugu Telugu Political and Movie News Updates