హోర్ముజ్ మ‌ళ్లీ మూత‌… ప్ర‌పంచం దిగ్భ్రాంతి!

ఇరాన్ సంచ‌ల‌న నిర్ణ‌యం తీసుకుంది. త‌మ ప‌రిధిలో ప్ర‌పంచ వాణిజ్య నౌకార‌వాణాకు అత్యంత కీల‌క‌మైన హోర్ముజ్ జ‌ల‌సంధిని మూసి వేస్తున్న‌ట్టు తాజాగా ప్ర‌క‌టించింది. అదే క్ష‌ణంలో అమ‌లు కూడా చేసింది. దీంతో ఉరుములు లేని పిడుగులాంటి ఈ వార్త‌తో ప్ర‌పంచ దేశాలు దిగ్భ్రాంతి వ్య‌క్తం చేశాయి. సుదీర్ఘ విరామం త‌ర్వాత‌.. నాలుగు రోజుల కింద‌టే ఈ జ‌ల‌ర‌వాణా మార్గాన్ని .. ఇరాన్ ఎలాంటి ష‌ర‌తులు లేకుండా తెరిచింది. అనంత‌రం.. అమెరికా-ఇరాన్ దేశాల మ‌ధ్య ఒప్పందంపై సంత‌కాలు కూడా జ‌రిగాయి. దీంతో ఇక అంత‌టా శాంతి ప‌రిఢ‌విల్లుతుంద‌ని.. ప్ర‌పంచ వాణిజ్యానికి ఢోకా ఉండ‌ద‌ని అంద‌రూ అనుకున్నారు..

కానీ.. అనూహ్యంగా ఇరాన్‌.. త‌న నిర్ణ‌యాన్ని ప్ర‌క‌టించ‌డం, జ‌ల‌సంధిని మూసివేయ‌డంతో ఇప్పుడు మ‌రోసారి చ‌మురు, గ్యాస్ ర‌వాణాకు మ‌రింత ఆటంకాలు ఎదుర‌య్యే అవ‌కాశం ఉంద‌ని అంటున్నారు. తాజాగా అమెరికా – ఇరాన్‌ల మ‌ధ్య శాంతి ఒప్పందం కుదిరింది. ఇది సుమారు 60 రోజుల పాటు అమ‌ల్లో ఉంటుంద‌ని ఇరు దేశాలు కూడా ప్ర‌క‌టించాయి. దీంతోగ‌త ఫిబ్ర‌వ‌రి 28వ తేదీ నుంచి ఇప్ప‌టి వ‌ర‌కు జ‌ల‌సంధిలో ఎదురైన ఇబ్బందులు తొల‌గిపోతాయ‌ని.. ప్ర‌పంచ వ్యాప్తంగా ఇంధ‌న ర‌వాణా పుంజుకుంటుంద‌ని అంచ‌నాలు వేసుకున్నారు. కానీ, అనూహ్య నిర్ణ‌యంతో ఈ ఆశ‌ల‌న్నీ భంగ‌మ‌య్యాయి.

ఎందుకు?

ఇరాన్ ఈ నిర్ణ‌యం తీసుకోవ‌డం వెనుక‌.. ఇజ్రాయెల్ కార‌ణ‌మ‌ని పేర్కొంది. లెబ‌నాన్‌పై ఇజ్రాయెల్ వ‌ర‌సగా చేస్తున్న దాడుల‌తోనే ఈ నిర్ణ‌యం తీసుకున్న‌ట్టు తెలిపింది. అమెరికా-ఇరాన్ ఒప్పందంలో లెబ‌నాన్‌పై దాడులు నిలిపివేయాల‌ని ఉంద‌ని.. కానీ, ఇజ్రాయెల్ దాడుల‌ను నిలిపివేయ‌క‌పోగా.. త‌మ‌ను క‌వ్విస్తోంద‌ని ఇరాన్ పేర్కొంది. ఈ నేప‌థ్యంలోనే తాజా నిర్ణ‌యం తీసుకున్నట్టు తెలిపింది. అంతేకాదు.. తాము తీసుకున్న చ‌ర్య‌ల్లో ఇది తొలిదేన‌ని.. ముందుముందు మ‌రింత క‌ఠినంగా వ్య‌వ‌హ‌రిస్తామ‌ని పేర్కొన‌డం గ‌మ‌నార్హం.

భార‌త్‌కు ఇర‌కాటం..

తాజాగా ఇరాన్ తీసుకున్న నిర్ణ‌యంతో భార‌త్ మ‌రోసారి ఇర‌కాటంలో ప‌డింది. వాస్త‌వానికి రెండు రోజుల కింద‌ట నుంచి ఇరాన్ ప‌రిధిలోని జ‌ల‌సంధి నుంచి భార‌త నౌక‌లు ప్ర‌యాణం సాగిస్తున్నాయ‌ని కేంద్రం ప్ర‌క‌టించింది. మ‌రో నాలుగు రోజుల్లో జ‌ల‌సంధిని దాటుతాయ‌ని కూడా తెలిపింది. కానీ, ఇంత‌లోనే ఇరాన్ మ‌రోసారి దీనిని మూసివేయ‌డంతో ఇంధ‌న‌తోపాటు గ్యాస్‌, గోధుమ‌లు, ఖ‌ర్జూరం వంటి ర‌వాణా నిలిచిపోయింది. దీనిపై స‌మీక్షిస్తున్నామ‌ని.. కేంద్రంతాజాగా ప్ర‌క‌టించింది.