తమపై తాత్కాలిక నిషేధం ఎత్తివేయాలని.. ఉద్దేశ పూర్వకంగానే కేంద్ర ప్రభుత్వం తమపై నిషేధం విధించిందని ఆరోపిస్తూ.. టెలిగ్రామ్ ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించింది. శుక్రవారం కోర్టు కార్యకలాపాలు ప్రారంభమైన వెంటనే ఈ కేసు విచారణకు వచ్చింది. దీనిపై వాదనలు విన్న ఢిల్లీ హైకోర్టు.. ప్రస్తుత పరిస్థితిలో నిషేధం అనేది చిన్న చర్యేనని వ్యాఖ్యానించింది. నీట్ ప్రశ్న పత్రాలు లీకైతే.. ఎవరు బాద్యత వహిస్తారని ప్రశ్నించింది.
తాత్కాలిక నిషేధం వెనుక.. ఎలాంటి ఉద్దేశ పూర్వక చర్యలు కనిపించడం లేదని అభిప్రాయపడిన కోర్టు.. కేంద్రం తీసుకున్న చర్య ఆమోదయోగ్యమేనని పేర్కొంది. వైద్య విద్యా ప్రవేశాలకు సంబంధించి గత నెలలో నిర్వహించిన నీట్ ప్రశ్న పత్రాల లీకేజీ వ్యవహారం దేశాన్ని కుదిపేసిన నేపథ్యంలో మరోసారి ఈ పరీక్షను నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో కేంద్ర ప్రభుత్వం పక్కా చర్యలు తీసుకుంది. ఈ నేపథ్యంలో టెలిగ్రామ్ యాప్‌పై ఈ నెల 22వ తేదీ వరకు నిషేధం విధించింది.
అయితే.. తమపై నిషేధం విధించడం వెనుక మెటా, వాట్సాప్ వంటి సంస్థలు ఉన్నాయని.. వాటిపై లేని నిషేధం తమపై ఎందుకని పేర్కొంటూ.. టెలిగ్రామ్ యాజమాన్యం హైకోర్టును ఆశ్రయించింది. తమపై విధించిన నిషేధాన్ని ఎత్తివేయాలని కోరింది. ఈ క్రమంలో కేంద్ర ప్రభుత్వ వాదనలను కోర్టు పరిగణన లోకి తీసుకుంది. గత నెలలో నిర్వహించిన నీట్ ప్రశ్నపత్రం.. టెలిగ్రామ్ యాప్ ద్వారా లీకైందని అధికారులు పేర్కొన్నట్టు తెలిపింది. మోసపూరిత నెట్ వర్కులతోపాటు.. ఇతర అనుమానిత నెట్ వర్క్‌లపై నిషేధం విధించామని పేర్కొంది.
ఈ నిషేధం కేవలం ఈ నెల 22వ తేదీ వరకు మాత్రమే అమల్లో ఉంటుందని కేంద్రం వివరించింది. నీట్ సమస్యలు రాకుండా చూసేందుకు ఈ నిర్ణయం తీసుకున్నామని.. టెలిగ్రామ్ యాప్ పై ఎలాంటి దురుద్దే శాలు లేవని కోర్టుకు వివరించింది. ఏ నెట్‌వర్క్‌పైనైనా కేంద్ర ప్రభుత్వానికి అజమాయిషీ ఉంటుందని తెలిపింది. ఈ నేపథ్యంలో కోర్టు కూడా కేంద్ర నిర్ణయాన్ని సమర్ధించింది. నిషేధం అమలు కొనసాగుతుందని పేర్కొంది.
Gulte Telugu Telugu Political and Movie News Updates