‘పవన్ కల్యాణ్ పై దేశద్రోహం కేసు పెట్టాలి’

ఏపీ డిప్యూటీ సీఎం.. జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ల్యాణ్‌పై కేసు పెట్టాల‌ని.. ఆయ‌న వ‌ల్ల తెలంగాణ ప్ర‌జ‌లు మ‌నోవేద‌న‌కు గుర‌వుతున్నార‌ని తెలంగాణ ర‌క్ష‌ణ సేన(టీఆర్ ఎస్‌) పార్టీ అధ్య‌క్షురాలు క‌విత వ్యాఖ్యానించారు. తెలంగాణ ఏర్పాటును వేర్పాటుతో పోల్చిన ప‌వ‌న్ పై ఎందుకు కేసు పెట్ట‌లేద‌ని ఆమె నిల‌దీశారు. రేవంత్ రెడ్డి ప్ర‌భుత్వం ఉదాశీనంగా వ్య‌వ‌హ‌రించ‌డం వ‌ల్లే ప‌వ‌న్ వంటి వారు రెచ్చిపోతున్నార‌ని ఆమె వ్యాఖ్యానించారు. రేవంత్ రెడ్డి సీఎం అయ్యాక‌.. చాలా మంది తెలంగాణ భావ‌జాలంపై దాడి చేస్తున్నార‌ని విమ‌ర్శించారు.

జిల్లాల వారీగా పార్టీ రౌండ్ టేబుల్ స‌మావేశాలు నిర్వ‌హిస్తున్న క‌విత‌.. తాజాగా క‌రీంన‌గ‌ర్ లో నిర్వ‌హించిన రౌండ్ టేబుల్ స‌మావేశంలో మాట్లాడారు. క‌రీంన‌గ‌ర్‌.. పోరాటాల పుట్టినిల్లుగా పేర్కొన్నారు. అలాంటి చోట తెలంగాణ త‌ల్లి విగ్ర‌హం లేకపోవ‌డం దారుణ‌మ‌న్నారు.(వాస్త‌వానికి గ‌త ప‌దేళ్ల‌లో క‌విత ఎందుకు చేయ‌లేక‌పోయారన్న‌ది ప్ర‌శ్న అని ప‌లువురు వ్యాఖ్యానించారు). ఇక‌, ప‌వ‌న్ క‌ల్యాణ్‌.. తెలంగాణ‌ను వేర్పాటు వాదంతో పోల్చార‌ని.. ఇది తెలంగాణ‌ను అవ‌మానించ‌డ‌మేన‌ని అన్నారు. అలాంటి వారిపై దేశద్రోహం కేసు పెట్టాల‌ని వ్యాఖ్యానించారు.

కానీ, రేవంత్ రెడ్డి ప్ర‌భుత్వం తెలంగాణ ఉద్య‌మాన్ని ప్రాధాన్య‌త లేని అంశంగా ప‌రిగ‌ణిస్తోంద‌ని.. తెలంగాణ వాదుల‌ను అవ‌మానిస్తున్నా.. ప‌ట్టించుకోవ‌డం లేద‌ని క‌విత వ్యాఖ్యానించారు. తెలంగాణ ఉద్య‌మ స‌మ‌యంలో ప్రాణాలు అర్పించిన వారి కుటుంబాల‌కు కూడా న్యాయం చేయ‌లేద‌న్నారు. తాము పార్టీ ఏర్పాటు స‌మ‌యంలో ప్ర‌క‌టించిన‌ప్పుడు మాత్ర‌మే క‌ద‌లిక వ‌చ్చింద‌న్నా రు. ఇక‌పై ప్ర‌తి ప్రాంతంలోనూ ఉద్య‌మ‌కారుల‌ను తాను క‌లుస్తాన‌ని.. తెలంగాణ కోసం పోరాటం చేసిన వారిని గౌర‌వించుకునే స‌మ‌యం.. తెలంగాణ వాదాన్ని మ‌రింత బ‌లంగా వినిపించాల్సిన స‌మయం ఇదేన‌న్నారు.

దీనికి ముందు..

ఈ స‌మావేశానికి ముందు.. ఓ మీడియాతో మాట్లాడిన క‌విత‌.. త‌న వ‌ల్ల బీఆర్ ఎస్ పార్టీ ఓడిపోయింద‌న్న వ్యాఖ్య‌ల్లో వాస్త‌వం లేద‌న్నారు. విఫ‌ల‌మైన గ‌త ప్ర‌భుత్వం కార‌ణంగానే కూలిపోయింద‌న్నారు. తానే బీఆర్ ఎస్‌ను విలీనం కాకుండా కాపాడాన‌ని చెప్పారు. తాను లిక్క‌ర్ కేసులో అన్యాయంగా అరెస్ట‌య్యాన‌ని.. ఇదికేవ‌లం రాజ‌కీయ ప్రేరేపిత కేసుగా ఆమె పేర్కొన్నారు. కానీ.. త‌న‌ను బూచిగా చూపించి బీఆర్ఎస్ నాయ‌కులు ప్ర‌చారం చేస్తున్నార‌ని అన్నారు. త‌న‌వ‌ల్ల పార్టీ నిల‌బ‌డింద‌ని చెప్పారు. లేక‌పోతే.. ఏనాడో బీఆర్ ఎస్‌.. బీజేపీలో విలీనం అయి ఉండేద‌ని వ్యాఖ్యానించారు.