ఏపీలో వెలుగు చూసిన మద్యం కుంభకోణంలో గురువారం మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. లిక్కర్ కుంభకోణంలో అదనంగా లిక్కర్ రవాణాలోనూ భారీ ఎత్తున అవినీతి జరిగిందన్న విషయం ఇటీవలే వెలుగు చూసిన సంగతి తెలిసిందే. ఈ లిక్కర్ ట్రాన్స్ పోర్ట్ స్కాంలో ప్రత్యక్ష పాత్ర ఉందన్న ఆరోపణలతో వైసీపీ కీలక నేత, మాజీ మంత్రి కారుమూరి వెంకట నాగేశ్వరరావు కుమారుడు సునీల్ అరెస్టయ్యారు. మద్యం అక్రమ రవాణాపై కేసు నమోదు చేసిన ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అధికారులే గురువారం సునీల్ ను అరెస్టు చేశారు.
ఏపీ సీఐడీ దర్యాప్తు చేస్తున్న లిక్కర్ స్కాం ఆధారంగా ఈడీ కేసు కేసు నమోదు చేసిన సంగతి తెలిసిందే. లిక్కర్ స్కాంలో మనీ ల్యాండరింగ్ జరిగిన నేపథ్యంలోనే ఈ వ్యవహారంపై ఈడీ ప్రత్యేకంగా కేసు నమోదు చేసింది. ఈ కేసు దర్యాప్తులో భాగంగానే మద్యం రవాణాలోనూ పెద్ద ఎత్తున అక్రమాలు చోటుచేసుకున్నాయని ఈడీ గుర్తించింది. ఈ కేసులో ఇదివరకే లిక్కర్ స్కాం కీలక నిందితుడు కేసిరెడ్డి రాజశేఖరరెడ్డితో పాటు బీవరేజెస్ కార్పొరేషన్ మాజీ సీఎండీ వాసుదేవరెడ్డిలను ఈడీ అధికారులు అరెస్టు చేసిన సంగతి తెలిసిందే.
రాజ్ కేసిరెడ్డి, వాసుదేవరెడ్డిలను అరెస్టు చేసిన రోజున కారుమూరి ఇళ్లు, కార్యాలయాల్లో ఈడీ అధికారులు సోదాలు చేసిన సంగతి తెలిసిందే. ఈ సోదాల్లో భాగంగా మద్యం అక్రమ రవాణాలో కారుమూరి తండ్రీకొడుకుల పాత్ర ఉందన్న ఆధారాలు ఈడీ అదికారులకు లభించినట్లుగా వార్తలు వినిపించాయి. నాడు దొరికిన ఆధారాలను మరింత లోతుగా పరిశీలించిన ఈడీ అదికారులు… మద్యం అక్రమ రవాణాలో సునీల్ కు ప్రత్యక్ష పాత్ర ఉందని నిర్ధారించారు. ఈ నేపథ్యంలోనే గురువారం సునీల్ ను ఈడీ అరెస్టు చేసింది. హైదరాబాద్ లో అదుపులోకి తీసుకున్న సునీల్ ను ఈడీ అదికారులు గురువారమే నాంపల్లిలోని ఈడీ కోర్టులో హాజరు పరచనున్నారు.
Gulte Telugu Telugu Political and Movie News Updates