తెలంగాణ రాజధాని హైదరాబాద్ లో భూముల ధరలు ఆకాశాన్నంటిన విషయాన్ని కళ్లకు కట్టిన ఇటీవలి ప్రభుత్వ భూముల వేలం పెను వివాదానికే తెర తీసింది. ఇటీవల తెలంగాణలోని కాంగ్రెస్ సర్కారు నిర్వహించిన ప్రభుత్వ భూముల వేలంలో ఒక్కో ఎకరా రేటు రూ.237 కోట్లు పలికిన సంగతి తెలిసిందే. వేలం దాకా సాఫీగా సాగిన ఈ వ్యవహారం ఇప్పుడు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎంట్రీతో వివాదంలో చిక్కుకుంది. ప్రభుత్వం వేలం వేసిన 7 ఎకరాల భూమిలో 5 ఎకరాలు తనవేనని ఎస్బీఐ వాదిస్తోంది. కేవలం వాదనతోనే సరిపెట్టని ఎస్బీఐ.. తన భూమిని తనకు అప్పగించాలని ఏకంగా హైకోర్టునే ఆశ్రయించింది.
రాయదుర్గం పరిధిలోని నాలెడ్జ్ సిటీలోని సర్వే నెంబరు 83/1లో ఉన్న 7 ఎకరాల భూమిని ప్రభుత్వం గత నెల 28న వేలం వేసిన సంగతి తెలిసిందే. ఈ వేలంలో పెద్ద సంఖ్యలో పలు సంస్థలు పాల్గొన్నాయి. అప్పటికే ఎరకా నూ.100 కోట్ల రేటును దాటిన అక్కడి భూముల దరల నేపథ్యంలో ఆయా సంస్థలు ఈ భూమి కోసం భారీ రేట్లనే కోట్ చేశాయి.
ఈ క్రమంలో గౌర వెంచర్స్ సంస్థ అందరి కంటే అత్యధిక రేటును కోట్ చేసింది. ఎకరానికి రూ.237 కోట్లను కోట్ చేసిన ఆ సంస్థ… మొత్తం 7ఎకరాలకు గానూ రూ.1,660 కోట్లను చెల్లించేందుకు ముందుకు వచ్చింది. దీంతో సదరు వేలంలో ఆ భూమిని గౌర వెంచర్స్ దక్కించుకుందని ప్రభుత్వం ఓ ప్రకటన విడుదల చేసింది. ఈ వేలం అప్పటిదాకా నమోదైన అన్ని రికార్డులను బద్దలు కొట్టేసింది.
ఇక్కడిదాకా అంతా బాగానే ఉన్నా…ఇప్పుడు SBI నేరుగా హైకోర్టును ఆశ్రయించడంతో ఒక్కసారిగా అంతా షాక్ తిన్నారు. రాయదుర్గంలో ప్రభుత్వం వేలం వేసిన భూమి తనదేనని, ఆ భూమిపై రిట్ ఆర్డర్ ఇవ్వాలని ఎస్బీఐ తన పిటిషన్ లో హైకోర్టును కోరింది. ప్రభుత్వం వేలం వేసిన 7 ఎకరాల భూమిలో 5 ఎకరాలు తనవేనని, ఆ భూమిని తనకు దక్కేలా ఉత్తర్వులు ఇవ్వాలంటూ ఎస్బీఐ తన పిటిషన్ లో కోర్టును అభ్యర్థించింది. ఈ పిటిషన్ గురించి తెలిసిన వెంటనే… ప్రైవేట్ భూములను కూడా ప్రభుత్వం వేలం వేస్తోందా? అంటూ ఓ సరికొత్త చర్చకు తెర లేసింది.
IMAGE – THE HINDU
Gulte Telugu Telugu Political and Movie News Updates