విజయవాడలోని కృష్ణలంక ప్రాంతానికి చెందిన సాయికృష్ణ అనే యువకుడు లాకప్ డెత్ కు గురయ్యాడని తీవ్రస్థాయిలో ఆరోపణలు వస్తున్న సంగతి తెలిసిందే. ఆ యువకుడిపై పలు కేసులున్నాయని, ఈ క్రమంలోనే మే 9వ తేదీన అతడిని పోలీసులు తీసుకుపోయారని ప్రచారం జరుగుతోంది. ఆ తర్వాత ఆ యువకుడు ఇంటికి రాలేదని, ఆ యువకుడు లాకప్ డెత్ కావడంతో పోలీసులే అతడి శవాన్ని తగులబెట్టారని కొందరు వైసీపీ నేతలు సంచలన ఆరోపణలు చేస్తున్నారు.
అంతేకాదు, ఆ యువకుడు జనసేన కార్యకర్త అని, ఈ వ్యవహారంపై ఏపీ డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కల్యాణ్ స్పందించాలని మాజీ మంత్రి పేర్ని నాని డిమాండ్ చేశారు. ఈ క్రమంలోనే ఆ ఆరోపణలపై ఏపీ సీఎం చంద్రబాబు స్పందించారు.
ఆ వ్యవహారంపై సమగ్ర విచారణ జరపాలని ఏపీ డీజీపీ హరీశ్ కుమార్ గుప్తాను సీఎం చంద్రబాబు ఆదేశించారు. ఆ ఆరోపణలపై ఉన్నతస్థాయి విచారణ జరిపి నిష్పక్షపాతంగా నిజానిజాలు నిగ్గు తేల్చాలని ఆదేశాలు జారీ చేశారు. విచారణ తర్వాత తనకు సమగ్ర నివేదిక సమర్పించాలని కూడా ఆదేశించారు.
ఈ ఆరోపణల నేపథ్యంలోనే కృష్ణలంక పోలీస్ స్టేషన్ లో విధులు నిర్వహిస్తున్న సీఐను వీఆర్ కు పంపామని సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కు డీజీపీ హరీశ్ కుమార్ గుప్తా తెలిపారు.
Gulte Telugu Telugu Political and Movie News Updates