వైసీపీ ప్రభుత్వాన్ని మరోసారి రానివ్వను. వైసీపీ వ్యతిరేక ఓటు చీలనివ్వను అంటూ.. 2024 ఎన్నికలకు ముందు భీషణ ప్రతిజ్ఞ చేసిన జనసేన అధినేత పవన్ కల్యాణ్.. అనుకున్నట్టుగానే వైసీపి ప్రభుత్వాన్ని దింపేందుకు కూటమిగా ఏర్పడి.. ఎన్నికల్లో కలివిడిగా వ్యవహరించి విజయం దక్కించుకున్నారు. వచ్చే 15 సంవత్సరాల పాటు.. ఆయన కూటమిదే అధికారం అని కూడా తరచుగా చెబుతున్నారు. ఇవన్నీ.. ఎందుకు గుర్తుచేయాల్సి వస్తోందంటే.. పట్టుదలకు.. కృషికి.. పవన్ నిలువెత్తు నిదర్శనం అని చెప్పేందుకే.
ఇప్పుడు తాజాగా.. పవన్ కల్యాణ్.. రాష్ట్రాలు కాదు.. జాతీయ స్థాయిలో చక్రం తిప్పాలని నిర్ణయించుకున్నారు. జాతీయ రాజకీయాల్లో తనదైన శైలిని అవలంభించాలని ఆయన భావిస్తున్నారు. ఈ క్రమంలోనే సేనా దళం పేరుతో ప్రత్యేక విభాగాన్ని జాతీయస్థాయిలో విస్తరించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. తాజాగా జాతీయ స్థాయిలో జనసేనను విస్తరించే కార్యక్రమాలపై చర్చించేందుకు ఢిల్లీలో మూడు రోజుల పాటు ప్రత్యేక కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. తద్వారా.. వచ్చే 2029 సార్వత్రిక ఎన్నికల నాటికి.. జాతీయ జనసేనగా ఆవిర్భవించే అవకాశం కనిపిస్తోంది.
దశ-దిశ!
ఇప్పటి వరకు దక్షిణాది రాజకీయాలకు పరిమితమైన పవన్ కల్యాణ్‌కు డిప్యూటీ సీఎం అయిన తర్వాత.. ఆయన తీసుకుంటున్న చర్యలు, పాలన తీరును గమనించిన తర్వాత.. పలు రాష్ట్రాల్లో అభిమానులు, నాయకులు కూడా పెరుగుతున్నారు. తమిళనాడు, కేరళల్లో ప్రత్యక రాజకీయ అభిమాన సంఘాలు కూడా ఏర్పడ్డాయి. కేరళలో ఇటీవలే 120 మంది వివిధ పార్టీలకు చెందిన వారు వచ్చి జనసేన తీర్థం పుచ్చుకున్నారు. కర్ణాటకలోనూ పార్టీకి అనుచరులు ఉన్నారు. తమిళనాడులో కూడా ఇదే తరహా పరిస్థితి కనిపిస్తోంది. ఇవన్నీ.. జనసేనకు జాతీయ పార్టీగా అవతరించేందుకు అవకాశం కల్పిస్తున్నాయి.
ప్రాంతీయ పార్టీగా ఉన్న జనసేన సిద్ధాంతాలు, భావజాలాన్ని జాతీయ స్థాయికి తీసుకెళ్లేందుకు జనసేనాని ప్రయత్నం చేస్తున్నారు. అంతేకాదు.. జాతీయస్థాయిలో యువతను ఆకర్షించడం ద్వారా.. వచ్చే ఎన్నికల్లో పలు రాష్ట్రాల్లోనూ జనసేన పోటీకి నిలబడేలా చేయాలన్న ముందస్తు వ్యూహంతో జనసేన అధినేత వ్యవహరిస్తున్నారు.
దీంతో జనసేన నాయకులకు ముఖ్యంగా జాతీయస్థాయిలో కార్యకర్తలు, నాయకులను ఆకర్షించేందుకు దశ-దిశకు సంబంధించి మూడు రోజుల పాటు కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. ఇది సక్సెస్ అయితే.. జనసేన జాతీయ పార్టీగా ఆవిర్భవించడం.. సమీప దూరంలోనే ఉందని అంటున్నారు పరిశీలకులు.
Gulte Telugu Telugu Political and Movie News Updates
