నెల్లూరు జిల్లా వైసీపీలో మాజీ మంత్రుల సెల్ఫ్ గోల్ రాజకీయాలు పార్టీని, వారి కార్యకర్తలను తీవ్ర స్థాయిలో ఇబ్బందికి గురిచేస్తున్నాయి. గతంలో జగన్ హయాంలో ఈ జిల్లా నుంచి ఇద్దరు మంత్రులు పనిచేశారు. అయితే గత ఎన్నికల్లో ఇద్దరు ఓడిపోయారు. తాజాగా జిల్లా రాజకీయాలను గమనిస్తే ఒకరిపై ఒకరు పైచేయి సాధించాలన్న విధంగా వ్యవహరిస్తున్నారనే టాక్ వినిపిస్తోంది. ఒకరు జిల్లా మొత్తం తన కనుసన్నల్లోనే ఉందని చెప్పుకోగా మరొకరు రెడ్డి సామాజిక వర్గం అంతా తాను చెప్పినట్టే నడుస్తుందని బాహాటంగానే వ్యాఖ్యలు చేశారు.
అయితే.. వీరిలో ఒకరు సైలెంట్ అయిపోగా మరొకరు అప్పుడప్పుడు మీడియా ముందుకు రావడం ప్రభుత్వం మీద విమర్శలు చేయడం కనిపిస్తోంది. తాజాగా డీఎస్సీ విద్యార్థులకు అన్యాయం జరిగిందని ఆరోపిస్తూ వైసిపి నాయకులు రాష్ట్రవ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు చేపట్టారు. నెల్లూరు జిల్లాలో ఈ ఇద్దరు మాజీ మంత్రులు ఈ కార్యక్రమాన్ని తామే విజయవంతం చేశామని చెప్పుకునేందుకు ప్రాధాన్యం ఇవ్వడం గమనార్హం. వాస్తవానికి రాష్ట్ర వ్యాప్తంగా ఈ కార్యక్రమం నిర్వహించాలని వైసిపి పిలుపు ఇచ్చింది.
అయినప్పటికీ కొంతమంది నాయకులు మాత్రమే పాల్గొన్నారు. నెల్లూరు జిల్లాలో మాజీ మంత్రులు ఇద్దరు ఈ కార్యక్రమాలు నిర్వహించారు. కానీ, ఇద్దరూ తమవల్లే జిల్లాల్లో వైసిపి నిరసన విజయవంతం అయిందని చెప్పుకోవడం ఆశ్చర్యానికి గురిచేసింది. వాస్తవానికి అందరూ కలిసి ఉమ్మడిగా నిరసన కార్యక్రమాన్ని విజయవంతం చేశామని చెప్పుకుంటే ఒక రకంగా ఉండేది. కానీ, దీనికి భిన్నంగా తమ వల్లే ఈ కార్యక్రమం సక్సెస్ అయిందని ఒకరికొకరు సెల్ఫ్ గోల్ చేసుకోవటం గమనార్హం.
అంతేకాదు.. తమ వల్లే పార్టీ నిలబడుతుందని చెప్పుకోవడం వంటివి ఆసక్తిగాను, ఆశ్చర్యంగాను కూడా ఉంది. మరి ఇది పార్టీ కార్యకర్తల్లో వివాదాలకు, విభేదాలకు కూడా దారి తీసే పరిణామంగా చెబుతున్నారు. ఇట్లాంటి విషయాల్లో నాయకులు సంయమనం పాటించాల్సిన అవసరం ఉంది. మాజీ మంత్రులుగానే కాకుండా బాధ్యతాయుతమైన సామాజిక వర్గాలకు చెందిన నాయకులుగా వ్యవహరించాలి. అంతేతప్ప చిన్న పాటి కార్యక్రమాలకే సెల్ఫ్ గోల్ రాజకీయాలు చేసుకుంటే భవిష్యత్తులో కార్యకర్తలు దూరం అయ్యే ప్రమాదం ఉంటుందన్నది రాజకీయ విశ్లేషకులు చెబుతున్న మాట.
Gulte Telugu Telugu Political and Movie News Updates
